మనిషి కోసం... ఓ కన్నీటి చుక్క.
మనిషి మనిషి కేమివ్వ గలడు
సాటి మనిషి కేం చేయగలడు
చేద బావిలో బొక్కెనేసి
నీళ్ళు తొడినట్టు
అంతరాంతరాల్లోని దుఖాన్ని
తోడి బయట పోయగలడా
హృదయపు పొరల్లో మెటేసిన
ఒంటరి తనానికి మలాం పూసి
మాయం చేయగలడా
ఎడారిలో ఒయాసిస్సు కోసం
నడి సముద్రం లో గుక్కెడు
మంచి నీళ్ళ కోసం వెతికినట్టు
తననుతాను
వెతుక్కుం టున్న మనిషి
సాటి మనిషి కేంచేయగలడు
కాల గమనంలో సాగిపోతున్న
సూర్యోదయాలూ చంద్రోదయాలకంటే
వేగంగా పరుగు చట్రంలోకి
విసిరేయ బడ్డ మనిషి
మనస్సుని పోగొట్టుకుని
తన నుంచి తానెప్పుడో వేరయిన మనిషి
సాటి మనిషికేం ఊతమివ్వ గలడు
తన భుజాన్ని ‘బండికాని’లా
తాకట్టు పెట్టుకున్నవాడు
తోటి మనిషి
బరువునేం మోయగలడు
మనిషి తనాన్నే పోగొట్టుకుని
చుట్టూ వలయాన్ని
దిద్దుకున్న మనిషి
పక్కోడినేం పట్టించు కోగలడు
తనకు ‘పోట్రాయి’
తగిలితేనో
మోకాలి చిప్ప పగిలి తేనో
పాదాల కింద మంట రగిలితేనో
వులిక్కి పడి కళ్ళు తెరిచే వాడికి
చుట్టు పక్కల వాళ్లేమి తెలుస్తారు
వాళ్ళే ఆ ‘మనిషి’ కోసం
ఓ కన్నీటి చుక్క రాల్చాలి తప్ప
https://aanandvarala.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి