31, అక్టోబర్ 2013, గురువారం

ప్రేమ-స్నేహం



తొలి చూపులో ప్రేమించడం 
మొదటి పరిచయంలోనే స్నేహించడం సులభమే 
సహజంగా స్వచ్చంగా వాటిని కొనసాగించడమే కష్టం 

వాత్సవానికి ఆ రెండు నీ చేతుల్లో ఉన్నాయా 

ఒక చేయితో చప్పట్లు సాధ్యం కానట్టు 
ప్రేమకు ఒక మనసు చాలదు 
స్నేహానికి ఒక మనిషీ చాలడు

ఆ రెంటికి మనుషులు కావాలి
ఆత్మలున్న మనుషులు కావాలి 

ప్రేమలోనూ స్నేహంలోను 
ఇవ్వడం పుచ్చుకోవడం రెండు వుంటాయి 

ప్రేమకు అనంతమైన భావోద్వేగమూ 
స్నేహానికి నిర్మలమైన స్వచ్చతా  కావాలి 

కాని 
స్వికరించటమె అలవాటుగా మారిన మనుషుల మధ్య  
ప్రేమ స్నేహం నీ చేతుల్లో ఉన్నాయా 

'నేను' నుంచి 'మనం' దాకా 
మారడానికి సిద్ధంగా లేని మనుషుల మధ్య 
ఆ రెండు ఒయాసిస్సులు కావా 

ఒకటి కాదు రెండు కాదు అన్నీ
 'నేను' గా మారిన చోట 
అన్నీ 'నావి' గా మారిన చోట 
ప్రతిదీ నగదు విలువైన చోట ప్రేమ స్నేహం మూర్ఖత్వమే
ప్రేమించడం స్నేహించడం అర్థంలేని మాటలే 

కానీ 
తడి వున్న వాణ్ని, వేళ్ళున్న వాణ్ని 
ఆ రెండు లేకపోతే దిక్కు లేని వాన్నవుతాను 
ఈ లోకమే దిక్కు లేని దవుతుంది.

-ఆనంద్ వారాల 
9440501281

ఒక్కో సారి

ఒక్కోసారి నిలిచిపోవడం 
కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం 
మంచిదేనేమో 
ఎట్లా చెప్పగలం 
కూలబడ్డవాడు తిరిగి కూడదిసుకొడని 
సర్వశక్తుల్ని ఒక్కటొక్కటి గా చేరదిసుకుని 
నిలుచున్న చోటి నుంచి నింగి దాక ఎగరడని
ఎట్లా చెప్పగలం 
ఒక్కోసారి వెనక్కి తిరగడం 
ముందు శూన్యమై నిలబద్దచోటే కూలబడడం 
మంచిదేనేమో

ఎట్లా కాదనగలం 
కూలబడ్డ వాడు నిలబడడని
ఎదురు తిరగడని
పునరుత్సహాన్ని పుంజుకుని 
ఎదురు దాడి చేయడని
మనిషి  దేముంది 
పోట్రాయి తగులుతుంది బొక్క బోర్లా పడతాం
ఆయన లేచి నిలబడతాడు 
ఉవ్వెత్తున అలోస్తుంది
తలొంచుకుని క్షణ కాలం నిలిచి తలెత్తుకుంటాడు
చూరు తగిలి తల బొప్పి కడుతుంది 
చేత్తో తడుముకుంటూ 
ముందుకు సాగుతాడు 

మనిషి దేముంది 
ఆకులు రాలిన చెట్టు లాంటి వాడు 
ఎండిన మోట బావి లాంటి వాడు 
మళ్లీ చిగురిస్తాడు 
 ఉట లోంచి  ఎగిసిపడ్డ తేట నీరులా 
ఉప్పెన అవుతాడు 
ఒక్కోసారి 
నిలిచి పోవడం లోంచే 
నిలువెత్తుగా ఎగిసి పడడానికి సత్తువ వొస్తుంది 
తలెత్తుక తిరగడానికి 
ప్రాణ మొస్తుంది
-ఆనంద్ వారాల 
9440501281

కాన్చిటి' చౌరాస్తా అనబడే ఓ తెలంగాణ చౌరస్తా

కాన్చిటి'  చౌరాస్తా 
అనబడే ఓ తెలంగాణ చౌరస్తా 


ఎన్ని పాదాల స్పర్శతో పునితమయిందో 
ఎందరు మనుషుల కదలికలతో చైతన్యవంత మయిందో 

వాళ్ళు లేకుంటే దానికి అందమేముంది 
మనుషులందరూ కదులుతున్న చెట్లు 
ఉద్రేక, ఉద్యమ, ఉద్వేగ గాలిని
ఆవాహనం చేసుకున్న వారంతా 
విచ్చుకుంటున్న మొగ్గల్లా 
విరబూస్తున్న పువ్వుల్లా 
ఒకరినొకరు పెనవేసుకుంటూ 
కూడలి ఎంత బాగుంటుంది 
స్తబ్దత లేదు,జడత్వం లేదు,నిశబ్దం లేదు,

కాంక్షలు  మనషులు అవడం 
మనుషులు మహోద్రేకంతో మమేకవడం 

గొప్ప ప్రేమతో భావాల సంయమనంతో 
నాలుగు దిక్కుల్నించి కదుల్తున్న ప్రవాహమవడం 

ఎన్నేళ్ళుగానో ఎన్ని'బండి కానీలకు '
చిట్టీలు కట్టిన 'కాన్చీటి' చౌరస్తా
నేడు జీవ మయి హృదయమై 
మనుషులందర్నీ సజివుల్ని చేస్తోంది 
తాను నిత్య చైతన్య వంత మౌతోంది 
-ఆనంద్ వారాల 
9440501281

విషాదం

విషాదం 


ప్రవాహం నిత్య సత్యం 
కదలిక ఒక వాస్తవం 
చలన శిలతే జీవితం 

కానీ విషాదం ఏమిటంటే 
నిరంతర ల్యాబ్ డబ్ ల ప్రవాహం లో 
రెంటి మధ్య లయ బద్ధంగా విన బడుతున్న నిశబ్దము 
జీవితంలో భాగమే కదా 
నిజంగా 
నిరంతర కదలికలో ఓ క్షణం 
విరామమొస్తే ......
స్థాబ్దతా నిశ్చలనము శూన్యమే మన ముందు  నిలబడతాయి 
అది నిజంగా ఏమి స్థితి 
ఎటూ కదలడానికి వీల్లేదు 
ఎటూ మెదలదానికి వీల్లేదు 
మైళ్ళకు మైళ్ళు నడవాలనిపిస్టది
ఉరుకులు వేయాలని పిస్తది
అందరిలో కలవాలని పిస్తది
అందరిని అవ్వాలనిపిస్తధి

మనం అనుకున్నట్టుగా చేయలేకపోవడం
మనం అనుకున్నట్టుగా ఉండలేక పోవడం 
మరణం కన్నా విషాదం 
-ఆనంద్ వారాల 
9440501281

నో మాన్స్ లాండ్


నో మాన్స్ లాండ్ 


సరిహద్దుకు అవతల 
అది ఎవరికీ చెందిన స్థలం కాదు 
నన్ను చూడ్డానికి వచ్చావు 
గాలి నియంత్రించిన గదిలో
పడి వున్నాను 
నిన్ను చూస్తూనే వున్నాను 
కూడబలుక్కున్న మాటలు 
నీ కళ్ళల్లో ఓ కన్నీటి చార 

ఒద్దొద్దు నిశ్చింతగా ఉండొచ్చు 
నా పెదాల పై చిరు నవ్వు చార 
రక్తం శుభ్రమవుతున్నదంతే 
నా మనసూ శుభ్రమవుతున్నది 
స్ఫటికంలా అంతా స్వచ్చ మవుతున్నది 

అన్ని సరిహద్దులు దాటి వచ్చాం 
నువ్వు నేను ఒకే రాడార్ లో వున్నాం 
దుఖం వద్దు, వేదన వద్దు 
వీడ్కోలు తెలీని సాంగత్యంలో 
ఇక నిర్భయంగా కలిసి ఉందాం 
-ఆనంద్ వారాల 
9440501281