31, అక్టోబర్ 2013, గురువారం

ఒక్కో సారి

ఒక్కోసారి నిలిచిపోవడం 
కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం 
మంచిదేనేమో 
ఎట్లా చెప్పగలం 
కూలబడ్డవాడు తిరిగి కూడదిసుకొడని 
సర్వశక్తుల్ని ఒక్కటొక్కటి గా చేరదిసుకుని 
నిలుచున్న చోటి నుంచి నింగి దాక ఎగరడని
ఎట్లా చెప్పగలం 
ఒక్కోసారి వెనక్కి తిరగడం 
ముందు శూన్యమై నిలబద్దచోటే కూలబడడం 
మంచిదేనేమో

ఎట్లా కాదనగలం 
కూలబడ్డ వాడు నిలబడడని
ఎదురు తిరగడని
పునరుత్సహాన్ని పుంజుకుని 
ఎదురు దాడి చేయడని
మనిషి  దేముంది 
పోట్రాయి తగులుతుంది బొక్క బోర్లా పడతాం
ఆయన లేచి నిలబడతాడు 
ఉవ్వెత్తున అలోస్తుంది
తలొంచుకుని క్షణ కాలం నిలిచి తలెత్తుకుంటాడు
చూరు తగిలి తల బొప్పి కడుతుంది 
చేత్తో తడుముకుంటూ 
ముందుకు సాగుతాడు 

మనిషి దేముంది 
ఆకులు రాలిన చెట్టు లాంటి వాడు 
ఎండిన మోట బావి లాంటి వాడు 
మళ్లీ చిగురిస్తాడు 
 ఉట లోంచి  ఎగిసిపడ్డ తేట నీరులా 
ఉప్పెన అవుతాడు 
ఒక్కోసారి 
నిలిచి పోవడం లోంచే 
నిలువెత్తుగా ఎగిసి పడడానికి సత్తువ వొస్తుంది 
తలెత్తుక తిరగడానికి 
ప్రాణ మొస్తుంది
-ఆనంద్ వారాల 
9440501281

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి