17, డిసెంబర్ 2013, మంగళవారం


వెల్తురు ముక్కలు
======================
పువ్వు విప్పారినట్టు 
మంచు కురుస్తున్నట్టు
మేఘం కమ్ముకున్నట్టు 
గది నిండా చీకటి 
కన్ను తెరిచినా మూసినా చీకటే


ఈ చీకటి
కొంచెం తెరిపిస్తే బాగుండు
ఓ క్షణం వెల్తురు కిరణం ఎక్కడుందో చూసి వొచ్చెవాన్ని

ఈ చీకటి 
తేట తెల్లం కాకపోయినా
ఓ క్షణం విశ్రాంతి నిచ్చినా చాలు
ఆరు బయట పువ్వు  వికసించిందో లేదో
మంచు ముత్యాలు మెరిశాయో లేదో
నది కళ్ళు తెరిచి
నేల వైపు చూసిందో లేదో చూసి వొచ్చెవాన్ని
మూసిన కిటికీ లోంచి 
ఓ రెండు  వెల్తురు ముక్కలు కింద పడ్డాయి
కళ్ళకు కొంచెం ప్రాణం వచ్చింది
ఆ వెల్తురు ముక్కల్ని 
చేతిలోకి తీసుకున్నా
ఒళ్లంతా వెల్తురు ప్రవహించిం ది
గది సంగతేమో కాని
నా లోపలి చీకటి అంతా పటాపంచలయింది
-వారాల ఆనంద్ 

7, డిసెంబర్ 2013, శనివారం

 ఎట్లా.....
========
నాకేదీ నచ్చడం లేదు
నన్నసలు ఏదీ ఆకర్శించడం లేదు
అవును మరి
కళ్ళల్లో మెరుపు లేకుండా
పెదాలపై చిరునవ్వు  ఏం బాగుంటుంది
గుండెల్లో తడి లేకుండా
కరస్పర్శ ఏమి ఆనందాన్ని ఇస్తుంది
మనస్సు లో ఆర్తి లేకుండా
ఎడారి లాంటి పొడి మాటలు
ప్రేమల్ని ఎట్లా మోసుకొస్తాయి
 అంటీ ముట్టనట్టు ఉండే దేది
నాకు నచ్చడం లేదు
పై పైన వుండేదేది నాన్నాకర్శించడం లేదు
 మంచు తెర సన్నగా పగలందే
సూర్యోదయం ఎందుకు హాయి గొల్పుతుంది
చీకటి మెల్ల మెల్లగా తెమలందే
వెన్నెల వైభొగమెలా వస్తుంది
దుఖపు జీర లేకుండా
ఏదైనా ఆనందమేలా అవుతుంది
కష్టం లోంచి ఓ చెమట చుక్క రాలందే
దేనికయినా అందమెలా వస్తుంది
 అందుకే
గుండె లోతుల్లోంచి రాకుండా
పై పైన ఏమి వస్తే మాత్రం
ఎట్లా నచ్చుతుంది
ఆత్మ లోతుల్లోంచి  లేకుండా
ఎంత అందమయితే మాత్రం
ఎట్లా ఆకర్షిస్తుంది
-వారాల ఆనంద్
 aanand.blogspot.in


cell: 09440501281

3, డిసెంబర్ 2013, మంగళవారం

ఎందుకైనా మంచిది
===============

ఎందుకైనా మంచిది
కను రెప్పలు తెరిచే వుంచాలి
ప్రకృతి ఎ అందమైన దృశ్యాన్నో
ని కంటి లో వేసి పోవచ్చు
పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక
ఇంద్ర ధనస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు

ఎందుకైనా మంచిది
పిడికిలి తెరిచే వుంచాలి
ఎవరైనా చేతిలో చెయ్యేసి
స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు
నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు
ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు

ఎందుకైనా మంచిది
హృదయం తెరిచే వుంచాలి
మనసు గల ఏ మనిషో
తలుపు తట్టకుండానే పలకరించి పోవచ్చు
కదుల్తూ కదుల్తూ ఆత్మ గలవాడు
ప్రేమ సంతకం చేసి పోవచ్చు

-వారాల ఆనంద్
aanandvarala.blogspot.in

2, డిసెంబర్ 2013, సోమవారం

alt సత్యం

డిసెంబర్ 2013

ఏదో ఒకటి దేనికోసమో ఒక దానికోసం
నిరంతరం వెతుకుతూనే వుంటాం
అనవరతం తిరుగుతూనే వుంటాం
అది సత్యం కావచ్చు
సౌందర్యం కావచ్చు
అన్వేషణ కొనసాగుతూనే వుంటుంది
ప్రతి రోజూ ప్రతి క్షణమూ
సంఘర్షణ సంలీనత సమన్వయం
అన్నీ ఎదురవుతున్నా
ఏదీ తెలియని తనం
ఏదీ తెలుసుకో లేనితనం
మంచి చెడూ! ఆశా నిరాశా !
అంతా భ్రమ! విభ్రమ!!
అంతా గందరగోళం
ఇష్టం కోరికా తపనా
మనకు అర్థం కానిదేదో
దుఖం లోకి దారి తీస్తుంది
దుఖం అజ్ఞానానికి దారి హేతువవుతుంది
జీవతం నిరంతరం చలనం లో వుంటుంది
చలనం వైరుధ్య భరితం అవుతుంది
వైరుధ్యం లోంచి సంఘర్షణ
సంఘర్షణ లోంచి సత్యం బయట పడుతుంది
------------------------------------------------------------
vaakili.com  లో 1 డిసెంబర్ 2013 రోజున ప్రచురిత మైనది