26, డిసెంబర్ 2015, శనివారం

వీక్షించు- నేర్చుకో- నిర్మించు
-వారాల ఆనంద్
      ఇవాళ యువతీ యువకుల్లో ముఖ్యంగా విధ్యార్థుల్లో 'షార్ట్ ఫిలిమ్' ఒక బజ్ వర్డ్. ఇంజినీరింగ్ మెడికల్ కాలేజీల్లో  విస్తృతంగా ఈ షార్ట్ ఫిలిమ్స్ తయారవుతున్నాయి. తెలంగాణా యువతలో వున్న సృజన, మాధ్యమం పట్ల వున్న గ్లామర్, తమని తాము   నిరూపించుకునే క్రమంలో షార్ట్ ఫిలిమ్ ల ఉధృతి రాష్ట వ్యాప్తంగా కనిపిస్తున్నది. సామాజిక మాధ్యమాలు వారికి తోడుగా నిలుస్తున్నాయి. ప్రత్యేక మయిన పంపిణీ వ్యవస్థ అవసరం లేకుండా సెల్ఫ్ డిస్ట్రిబ్యూషన్/ సెల్ఫ్ రిలీజ్  చేసుకునే అవకాశాన్ని సామాజిక మాధ్యమాలు కల్పిస్తున్నాయి. ఆ షార్ట్ ఫిలిమ్ ల రీచ్ కూడా పెరుగు తున్నది. 
         దృశ్య మాధ్యమం యొక్క ప్రభావాన్ని ప్రతిభని ఇవ్వాళ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మొత్తం మానవ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. దృశ్యాల్నిఅనేక రకాలుగా ఉపయోగిస్తున్నప్పటికి మూవింగ్ ఇమేజెస్ ( కదులుతున్నబొమ్మల) కు మొదటి రూపమైన సినిమా ప్రభావం ఎనలేనిది. ఎన్నదగింది.
 తెలుగు ప్రధాన స్రవంతి సినిమా రంగం లో  తెలంగాణ స్థానం ఏమిటో దానికి కారణాలు ఏమిటో అందరికీ తెలిసినవే. ప్రస్తుత మైతే కేవలం కొన్ని కుటుంబాల పిడికిట్లో తెలుగు సినిమా బంధీ అయివున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ స్థితినుంచి మార్పు వచ్చి తెలంగాణ కూడా చలన చిత్రరంగం లో అద్భుత మైన రీజినల్ సినిమా గా ఎదగాల్సివుంది. బెంగాల్, కేరళ, మరాఠీ లాంటి భాషా చిత్రాలు మన ముందు గొప్ప రీజినల్ సినిమా గా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించడం మనకు తెలుసు. ఆస్థితి తెలంగాణ సినిమాకి రావాలంటే కొత్త తరం ఈ రంగం లోకి రావాల్సి వుంది. కొత్త అలోచనలతో కొత్త భావాలతో కెమెరా చేత బట్టి యువత ముందుకు రావాల్సి వుంది. 
     ఈ ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అనేక మంది యువకులు షార్ట్ ఫిలిమ్ లతో తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని షార్ట్ ఫిలిమ్ లయితే అద్భుతంగా వుండి తెలంగాణ జీవితము, సంస్కృతి, కళలు వీటన్నింటినీ దృశ్యమానం చేస్తున్నాయి. గొప్ప ఆశావాహ స్థితిని కల్పిస్తున్నాయి. యువతీ యువకుల్లో ముఖ్యంగా విధ్యార్థుల్లో షార్ట్ ఫిలిమ్ ఇవ్వాళ ఒక వేవ్ సృష్టిస్తూ వుంది. అంది వచ్చిన సాంకేతిక ప్రగతిని ఉపయోగించుకుని విస్తృతంగా షార్ట్ ఫిలిమ్స్ వైపు   కృషి చేస్తున్నారు. గతంలో కరీంనగర్ ఫిలిమ్ సొసైటి అయిదేళ్ళ పాటు నిర్వహించిన జాతీయ స్థాయి షార్ట్ అండ్ డాకుమెంటరీ ఫిలిమ్ ఫెస్టివల్ లో తెలంగాణా నుంచి విశేషమైన ప్రాతినిధ్యం కనిపించింది. ఒక ఫెస్టివల్ ముగింపు సమావేశానికి కె.చంద్ర శేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత ఫిలిమ్ తెలంగాణ నిర్వహించిన పోటీల్లో ఆశా వాహ స్థితి కనిపించింది. ఇక ఇటీవలే బతుకమ్మ సందర్భంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్బహించిన బతుకమ్మ ఫిల్మోత్సవ్ లో పాత వాళ్ళకే కాకుండా అనేక మంది  కొత్త వాళ్ళకి అవకాశం కల్పించింది.అనేక షార్ట్ ఫిలిమ్లు ఈ ఉత్సవం లో మొదటి సారి ప్రదర్శనకుకు నోచు కోవడం ముదావహం.
  కానీ ఇక్కడ కొన్నింటిని మినహాయిస్తే, అనేక షార్ట్ ఫిలింల విషయంలో ఒక అసంతృప్తి కనిపిస్తున్నది. కథా  కథనమే మూలమైన ఈ మాధ్యమం లో అపరి పక్వత కొంత నిరాశను కలిగిస్తున్నది. దీనికి వీటిని నిర్మిస్తున్న యువదర్శకుల్ని తప్పు పట్టాల్సిన పని లేదు.ఎందుకంటే సినిమా నిర్మాణం మనకి కొత్త. మెళకువలు కూడా అంతంత మాత్రమే. నిజానికి తెలంగాణ లో 
సృజన కి కొదువ లేదు. కథలకీ కమిట్మెంట్ కి తెలంగాణా పెట్టింది పేరు. కానీ దృశ్య మాధ్యమం విషయానికి వస్తే అక్కడ కళ తో పాటు టెక్నాలజీ కూడా ఇమిడి వుంటుంది. 
నిజానికి సినిమాలో కథ చెప్పం చూపిస్తాం, చెప్పడంలో చూపించడంలో వున్న తేడా ని మన షార్ట్ ఫిలిమ్ మేకర్స్ గుర్తించాల్సి వుంది. అది తెలియాలంటే కథ తో పాటు టెక్నాలజీ కూడా తెలియాలి. కేవలం కెమెరా తో షూట్ చేసినంత మాత్రాన అది ఫిలిమ్ అయిపోదు. 
     నిజానికి సినిమా నిర్మాణం ఒక సమిష్టి కృషి. సినిమాని అర్థం చేసుకోవడానికి యువతీ యువకులు ముఖ్యంగా మూడు అంశాల్ని పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. లూమియర్ సోదరులు ప్రారంభించిన నాటి నుంచి సినిమా రంగం లోని  కథల్లోనూ టెక్నాలజీ లోనూ వచ్చిన మార్పులు తెలుసుకోవాలి. సినిమా చరిత్ర గతిలో వచ్చిన గొప్ప సినిమాలు ఎందుకు గొప్పవి అయ్యాయో అర్థం చేసుకోవాలి. అంటే అలనాటి నుంచి నేటి వరకు వచ్చిన లాండ్ మార్క్ సినిమాల్ని శ్రద్దగా వీక్షించాలి. సినిమా అంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలే అనే  భ్రమ నుంచి బయట పది యూరోపేయన్ సినిమాల్ని కూడా వీక్షించి వాటిల్లోని ప్రయోగాల్ని గొప్పతనాన్ని తెలుసు కోగలగాలి. అప్పుడే మనం సినిమాలు ఎట్లా తీయాలో కంటే ఎట్లా తీయకూడదో తెలుస్తుంది. గతంలో గొప్ప సినిమాల్ని చూసేందుకు కేవలం ఫిలిమ్ సొసైటీ లు వేదికగా వుండేవి. కానీ ఈరోజు ఇంటర్నెట్ వేదికగా అనేక గొప్ప సినిమాలు వీక్షించే అవకాశం నేటి తరానికి అందుబాటులో వుంది.అందుకే షార్ట్ ఫిలిమ్ మేకర్స్ గొప్ప సినిమాల్ని వీక్షించడం అలవాటు చేసుకోవాలి. 
       అంతర్జాతీయంగా వెలుగొందిన గొప్ప సినిమాల్ని చూడడంతో పాటు ఆయా దర్శకులు అవి తీసిన విధానాల్ని అవగతం చేసుకోవాలి. స్క్రీన్ ప్లే, షాట్ డివిషన్ లాంటి అనేక విషయాల్లో గొప్ప సినిమాలు కథని ఎట్లా  నిర్వహించాయో నేర్చుకోవాలి దాంతోపాటు ఆధునికంగా వస్తున్న టెక్నాలజీ మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అంటే గొప్ప సినిమాల్ని చూస్తూనే వాటికి సంభందించిన లిటరేచర్ ని కూడా చదవాలి. అప్పుడే సినిమాల నిర్మాణానికి చెందిన అనేక విషయాలు అవగతం అవుతాయి. దీనికి సినిమాల పైన నిర్మాణం పైన ఆసక్తి వున్న యువతీయువకులంతా వీక్షించడం నేర్చుకోవడం పైన దృష్టి పెట్టాలి. వీక్షించి,నేర్చుకుని, నిర్మించడం చేయాలి. నిజానికి ఇదీ క్రమం కానీ ప్రస్తుతం యువత ఏదో ఒక రకంగా షార్ట్ ఫిలిమ్ తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వారి చిత్రాల్ని చూస్తే తెలుస్తుంది. నిర్మించడం పైననే దృష్టి పెడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ గొప్ప సినిమాల్ని వీక్షించడం, నేర్చుకోవడం,నిర్మించడం సమాంతరంగా చేసినప్పుడే మనదైన సినిమా, మంచి షార్ట్ సినిమా తయారవుతుంది. 
     ఇందులో రాష్ట్ర ప్రభుత్వ భాద్యత కూడా వుంది. ఫిలిమ్ స్కూల్స్ పెట్టడం,ఇప్పుడున్న యూనివర్సిటీల్లో మాస్ మీడియా కోర్సులు పెట్టడం చేయాలి. గొప్ప సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తూ ప్రధాన జిల్లా కేంద్రాల్లో చిన్న చిన్న థియేటర్లు నిర్మించాల్సి వుంది. ఇలా ప్రభుత్వం కొంత తోడ్పడితే తెలంగాణా నుంచి  మంచి షార్ట్ ఫిలింలు భవిష్యత్తు లో పూర్తి నిడివి చిత్రాలు వచ్చి తెలంగాణ జెండాని ప్రపంచ వ్యాప్తంగా రేప రేప లాడించే అవకాశం వుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి