25, డిసెంబర్ 2015, శుక్రవారం

జ్ణాపకాలు

జ్ణాపకాలు
==================
-వారాల ఆనంద్
---------------------------------
ఒకటా రెండా
తల నిండా జ్ణాపకాల ఉప్పెన

సముద్రం లో నీటి  బిందువుల్లా
ఉవ్వెత్తున ఎగిసి
అంతలోనే వెనక్కి పోతాయి

ఇసుక రేణువుల్లా
కుప్పలు కుప్పలే తప్ప
లెక్కకు అందవు

ఒంటరిగా వుంటే చాలు
డప్పోని ఎనుక కొమ్మోడు పోయినట్టు
వరుసకట్టి
మనసు మోత మొగిస్తాయి

పయికి కనిపించవు
కానీ
పిలవని పేరంటం లాగా
వచ్చి వాళ్తాయి
తిర్లేసి మర్లేసి
పాత కథల్నే  వల్లే  వేస్తాయి 

జ్ణాపకాలు వట్టి పిరికివి
బయట ధ్వని వినిపిస్తే చాలు
ముడుచుకు పోతాయి

జ్నాపకాల దీపాల్ని ఆర్పలేము
కొడిగట్టినట్టే వుంటాయి
కొస ప్రాణంతో నయినా వుంటాయి

గడిచిన కాలపు
నలుపు తెలుపుల్ని
వెంటేసుకు తిరుగుతాయి

ఏది ఎట్లా పోయినా
జ్ణాపకాలు మన వెంటే
ఊపిరి తో పాటు.......
================== 
9440501281 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి