29, డిసెంబర్ 2015, మంగళవారం

తెల్ల కాగితం పై నల్లటి అక్షరాలు
---------------------------------------

తెల్ల కాగితాన్ని ముందేసుకు కూర్చుంటాను
గంటల కొద్దీ రాత్రులూ పగళ్లూ
చేతిలో కలం కాసేపు నిశ్చలంగానే వుంటుంది
ఇంకొంచెం సేపు నోట్లో నలుగుతూనో
తల పైన నృత్యం చేస్తూనో వుంటుంది

యమ యాతన
తెల్ల కాగితం పై నాలుగు అక్షరాలు పొదగడానికి
నాలుగు మాటలు ఆల్లడానికి

నాలోకి నేను ప్రవేశి స్తాను
నాకు తెలీందేమైనా దొరుకుతుం దేమోనని
శారీరంలో ఏముంది అవయాల పొందిక
మనసులోకి వెళ్ళాను
ఆత్మ లోకి తొంగి చూశాను
నిజంగానే నాకు తెలీని విషయాలు
నాలోనూ వున్నాయి
++++
నాలోంచి సమాజం మీద పడ్డా
పొరలు పొరలుగా
విడిపోయి వున్న సమాజం
ఏకశిల కాదు, మొజైక్

లోపలా బయటా
ఈ బైఫోకల్ దృష్టి
నన్ను ఇస్సుర్రాయి లో పడేసి నలిపేసింది

చర్నింగ్ చర్నింగ్
అతలాకుతలం అంతర్మధనం
అప్పటి దాకా నాలో
మూసివున్న దర్వాజా
ఏదో తెరుచుకున్నట్టయింది
+++
ఈరోజు నిన్నటి ప్రతిబింబం కాదు
రేపు ఇవ్వాల్టీ రూపం వుండక పోవచ్చు

క్షణం క్షణం మారుతున్న సమాజం
నాలోపల మనసున పట్టని తనం

పిడికిట్లోంచి సన్నని  ఇసుకేదో రాలి పోయినట్టు
ఏదో జారి పోతున్నది
+++
జారిన దాన్ని ఒడిసి పట్టుకుంటే
కళ్ల ముందు కనిపించే దాంట్లో
సత్యమేదో గోచరిస్తుంది

కలం తెల్లటి కాగితం పై
నల్లటి అక్షరాల్ని చెక్కుతోంది

కలమూ నేను వేరు కాదు

చూద్దును కదా కాగితం పై
కవిత్వం విచ్చుకుంటోంది

-వారాల ఆనంద్

9440501281

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి