25, డిసెంబర్ 2015, శుక్రవారం

పాట- పాటగాడు


పాట- పాటగాడు   

 అవిటి కాళ్ళు
ఆరని ఆర్తి

చెక్క బల్ల
నాలుగు గీరలు
నడకయినా పరుగయినా
చక్రాల బల్ల నే

అరచేతులే
పడవ తెడ్లై
జాన ప్రవాహం లో
అతన్ని నడిపిస్తాయి

చక్రాల్లాంటి కళ్ళు
తెర చాపలయి దిక్కులు చూపిస్తాయి

అరాచకపు ట్రాఫిక్ రణ గొణ నడుమ
అటూ ఇటూ చూసి
రోడ్డు పక్క లంగరేసుకుని
చక్రాల బండి నిలిచి పోతుంది

దుఖం లో తడిసిన
పాటేదో అలలు అలలు గా
అక్కడంతా వ్యాపిస్తుంది

కంఠం లో మాధుర్యం లేదు
రాగం లో సరిగమల్లేవు
గురిచూసి హృదయాన్ని తాకే
గుణమేదో పాటకు
ప్రాణం పోస్తోంది

భాషలు ఒకటో రెండో
రెండూ కలివిడిగానో
పాట ప్రవాహమై పరీవ్యాప్తమవుతోంది

ఆర్ధ్రతో ఆకలో
జీవనపోరాటపు
కంజీర నాదమో
మనసంతా కలి కలి

ఉరుకులు పరుగుల నడుమ
కాలం నిలవదు
పాటా అంతే
గొంతు లోదే కాదు
గుండె లోని తడి ఆరేదాకా

 గడియ రికామీ లేని
రోడ్లన్నీ
పరుగులు పెడుతూనే వున్నాయి
  
పాటకు
అడవిల పొద్దు గూకింది
పాటగాడికి
ఎడారిల తెల్లారింది

-వారాల ఆనంద్

9440501281    aanandvarala@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి