29, డిసెంబర్ 2015, మంగళవారం

తెల్ల కాగితం పై నల్లటి అక్షరాలు
---------------------------------------

తెల్ల కాగితాన్ని ముందేసుకు కూర్చుంటాను
గంటల కొద్దీ రాత్రులూ పగళ్లూ
చేతిలో కలం కాసేపు నిశ్చలంగానే వుంటుంది
ఇంకొంచెం సేపు నోట్లో నలుగుతూనో
తల పైన నృత్యం చేస్తూనో వుంటుంది

యమ యాతన
తెల్ల కాగితం పై నాలుగు అక్షరాలు పొదగడానికి
నాలుగు మాటలు ఆల్లడానికి

నాలోకి నేను ప్రవేశి స్తాను
నాకు తెలీందేమైనా దొరుకుతుం దేమోనని
శారీరంలో ఏముంది అవయాల పొందిక
మనసులోకి వెళ్ళాను
ఆత్మ లోకి తొంగి చూశాను
నిజంగానే నాకు తెలీని విషయాలు
నాలోనూ వున్నాయి
++++
నాలోంచి సమాజం మీద పడ్డా
పొరలు పొరలుగా
విడిపోయి వున్న సమాజం
ఏకశిల కాదు, మొజైక్

లోపలా బయటా
ఈ బైఫోకల్ దృష్టి
నన్ను ఇస్సుర్రాయి లో పడేసి నలిపేసింది

చర్నింగ్ చర్నింగ్
అతలాకుతలం అంతర్మధనం
అప్పటి దాకా నాలో
మూసివున్న దర్వాజా
ఏదో తెరుచుకున్నట్టయింది
+++
ఈరోజు నిన్నటి ప్రతిబింబం కాదు
రేపు ఇవ్వాల్టీ రూపం వుండక పోవచ్చు

క్షణం క్షణం మారుతున్న సమాజం
నాలోపల మనసున పట్టని తనం

పిడికిట్లోంచి సన్నని  ఇసుకేదో రాలి పోయినట్టు
ఏదో జారి పోతున్నది
+++
జారిన దాన్ని ఒడిసి పట్టుకుంటే
కళ్ల ముందు కనిపించే దాంట్లో
సత్యమేదో గోచరిస్తుంది

కలం తెల్లటి కాగితం పై
నల్లటి అక్షరాల్ని చెక్కుతోంది

కలమూ నేను వేరు కాదు

చూద్దును కదా కాగితం పై
కవిత్వం విచ్చుకుంటోంది

-వారాల ఆనంద్

9440501281

26, డిసెంబర్ 2015, శనివారం

వీక్షించు- నేర్చుకో- నిర్మించు
-వారాల ఆనంద్
      ఇవాళ యువతీ యువకుల్లో ముఖ్యంగా విధ్యార్థుల్లో 'షార్ట్ ఫిలిమ్' ఒక బజ్ వర్డ్. ఇంజినీరింగ్ మెడికల్ కాలేజీల్లో  విస్తృతంగా ఈ షార్ట్ ఫిలిమ్స్ తయారవుతున్నాయి. తెలంగాణా యువతలో వున్న సృజన, మాధ్యమం పట్ల వున్న గ్లామర్, తమని తాము   నిరూపించుకునే క్రమంలో షార్ట్ ఫిలిమ్ ల ఉధృతి రాష్ట వ్యాప్తంగా కనిపిస్తున్నది. సామాజిక మాధ్యమాలు వారికి తోడుగా నిలుస్తున్నాయి. ప్రత్యేక మయిన పంపిణీ వ్యవస్థ అవసరం లేకుండా సెల్ఫ్ డిస్ట్రిబ్యూషన్/ సెల్ఫ్ రిలీజ్  చేసుకునే అవకాశాన్ని సామాజిక మాధ్యమాలు కల్పిస్తున్నాయి. ఆ షార్ట్ ఫిలిమ్ ల రీచ్ కూడా పెరుగు తున్నది. 
         దృశ్య మాధ్యమం యొక్క ప్రభావాన్ని ప్రతిభని ఇవ్వాళ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మొత్తం మానవ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. దృశ్యాల్నిఅనేక రకాలుగా ఉపయోగిస్తున్నప్పటికి మూవింగ్ ఇమేజెస్ ( కదులుతున్నబొమ్మల) కు మొదటి రూపమైన సినిమా ప్రభావం ఎనలేనిది. ఎన్నదగింది.
 తెలుగు ప్రధాన స్రవంతి సినిమా రంగం లో  తెలంగాణ స్థానం ఏమిటో దానికి కారణాలు ఏమిటో అందరికీ తెలిసినవే. ప్రస్తుత మైతే కేవలం కొన్ని కుటుంబాల పిడికిట్లో తెలుగు సినిమా బంధీ అయివున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ స్థితినుంచి మార్పు వచ్చి తెలంగాణ కూడా చలన చిత్రరంగం లో అద్భుత మైన రీజినల్ సినిమా గా ఎదగాల్సివుంది. బెంగాల్, కేరళ, మరాఠీ లాంటి భాషా చిత్రాలు మన ముందు గొప్ప రీజినల్ సినిమా గా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించడం మనకు తెలుసు. ఆస్థితి తెలంగాణ సినిమాకి రావాలంటే కొత్త తరం ఈ రంగం లోకి రావాల్సి వుంది. కొత్త అలోచనలతో కొత్త భావాలతో కెమెరా చేత బట్టి యువత ముందుకు రావాల్సి వుంది. 
     ఈ ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అనేక మంది యువకులు షార్ట్ ఫిలిమ్ లతో తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని షార్ట్ ఫిలిమ్ లయితే అద్భుతంగా వుండి తెలంగాణ జీవితము, సంస్కృతి, కళలు వీటన్నింటినీ దృశ్యమానం చేస్తున్నాయి. గొప్ప ఆశావాహ స్థితిని కల్పిస్తున్నాయి. యువతీ యువకుల్లో ముఖ్యంగా విధ్యార్థుల్లో షార్ట్ ఫిలిమ్ ఇవ్వాళ ఒక వేవ్ సృష్టిస్తూ వుంది. అంది వచ్చిన సాంకేతిక ప్రగతిని ఉపయోగించుకుని విస్తృతంగా షార్ట్ ఫిలిమ్స్ వైపు   కృషి చేస్తున్నారు. గతంలో కరీంనగర్ ఫిలిమ్ సొసైటి అయిదేళ్ళ పాటు నిర్వహించిన జాతీయ స్థాయి షార్ట్ అండ్ డాకుమెంటరీ ఫిలిమ్ ఫెస్టివల్ లో తెలంగాణా నుంచి విశేషమైన ప్రాతినిధ్యం కనిపించింది. ఒక ఫెస్టివల్ ముగింపు సమావేశానికి కె.చంద్ర శేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత ఫిలిమ్ తెలంగాణ నిర్వహించిన పోటీల్లో ఆశా వాహ స్థితి కనిపించింది. ఇక ఇటీవలే బతుకమ్మ సందర్భంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్బహించిన బతుకమ్మ ఫిల్మోత్సవ్ లో పాత వాళ్ళకే కాకుండా అనేక మంది  కొత్త వాళ్ళకి అవకాశం కల్పించింది.అనేక షార్ట్ ఫిలిమ్లు ఈ ఉత్సవం లో మొదటి సారి ప్రదర్శనకుకు నోచు కోవడం ముదావహం.
  కానీ ఇక్కడ కొన్నింటిని మినహాయిస్తే, అనేక షార్ట్ ఫిలింల విషయంలో ఒక అసంతృప్తి కనిపిస్తున్నది. కథా  కథనమే మూలమైన ఈ మాధ్యమం లో అపరి పక్వత కొంత నిరాశను కలిగిస్తున్నది. దీనికి వీటిని నిర్మిస్తున్న యువదర్శకుల్ని తప్పు పట్టాల్సిన పని లేదు.ఎందుకంటే సినిమా నిర్మాణం మనకి కొత్త. మెళకువలు కూడా అంతంత మాత్రమే. నిజానికి తెలంగాణ లో 
సృజన కి కొదువ లేదు. కథలకీ కమిట్మెంట్ కి తెలంగాణా పెట్టింది పేరు. కానీ దృశ్య మాధ్యమం విషయానికి వస్తే అక్కడ కళ తో పాటు టెక్నాలజీ కూడా ఇమిడి వుంటుంది. 
నిజానికి సినిమాలో కథ చెప్పం చూపిస్తాం, చెప్పడంలో చూపించడంలో వున్న తేడా ని మన షార్ట్ ఫిలిమ్ మేకర్స్ గుర్తించాల్సి వుంది. అది తెలియాలంటే కథ తో పాటు టెక్నాలజీ కూడా తెలియాలి. కేవలం కెమెరా తో షూట్ చేసినంత మాత్రాన అది ఫిలిమ్ అయిపోదు. 
     నిజానికి సినిమా నిర్మాణం ఒక సమిష్టి కృషి. సినిమాని అర్థం చేసుకోవడానికి యువతీ యువకులు ముఖ్యంగా మూడు అంశాల్ని పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. లూమియర్ సోదరులు ప్రారంభించిన నాటి నుంచి సినిమా రంగం లోని  కథల్లోనూ టెక్నాలజీ లోనూ వచ్చిన మార్పులు తెలుసుకోవాలి. సినిమా చరిత్ర గతిలో వచ్చిన గొప్ప సినిమాలు ఎందుకు గొప్పవి అయ్యాయో అర్థం చేసుకోవాలి. అంటే అలనాటి నుంచి నేటి వరకు వచ్చిన లాండ్ మార్క్ సినిమాల్ని శ్రద్దగా వీక్షించాలి. సినిమా అంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలే అనే  భ్రమ నుంచి బయట పది యూరోపేయన్ సినిమాల్ని కూడా వీక్షించి వాటిల్లోని ప్రయోగాల్ని గొప్పతనాన్ని తెలుసు కోగలగాలి. అప్పుడే మనం సినిమాలు ఎట్లా తీయాలో కంటే ఎట్లా తీయకూడదో తెలుస్తుంది. గతంలో గొప్ప సినిమాల్ని చూసేందుకు కేవలం ఫిలిమ్ సొసైటీ లు వేదికగా వుండేవి. కానీ ఈరోజు ఇంటర్నెట్ వేదికగా అనేక గొప్ప సినిమాలు వీక్షించే అవకాశం నేటి తరానికి అందుబాటులో వుంది.అందుకే షార్ట్ ఫిలిమ్ మేకర్స్ గొప్ప సినిమాల్ని వీక్షించడం అలవాటు చేసుకోవాలి. 
       అంతర్జాతీయంగా వెలుగొందిన గొప్ప సినిమాల్ని చూడడంతో పాటు ఆయా దర్శకులు అవి తీసిన విధానాల్ని అవగతం చేసుకోవాలి. స్క్రీన్ ప్లే, షాట్ డివిషన్ లాంటి అనేక విషయాల్లో గొప్ప సినిమాలు కథని ఎట్లా  నిర్వహించాయో నేర్చుకోవాలి దాంతోపాటు ఆధునికంగా వస్తున్న టెక్నాలజీ మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అంటే గొప్ప సినిమాల్ని చూస్తూనే వాటికి సంభందించిన లిటరేచర్ ని కూడా చదవాలి. అప్పుడే సినిమాల నిర్మాణానికి చెందిన అనేక విషయాలు అవగతం అవుతాయి. దీనికి సినిమాల పైన నిర్మాణం పైన ఆసక్తి వున్న యువతీయువకులంతా వీక్షించడం నేర్చుకోవడం పైన దృష్టి పెట్టాలి. వీక్షించి,నేర్చుకుని, నిర్మించడం చేయాలి. నిజానికి ఇదీ క్రమం కానీ ప్రస్తుతం యువత ఏదో ఒక రకంగా షార్ట్ ఫిలిమ్ తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వారి చిత్రాల్ని చూస్తే తెలుస్తుంది. నిర్మించడం పైననే దృష్టి పెడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ గొప్ప సినిమాల్ని వీక్షించడం, నేర్చుకోవడం,నిర్మించడం సమాంతరంగా చేసినప్పుడే మనదైన సినిమా, మంచి షార్ట్ సినిమా తయారవుతుంది. 
     ఇందులో రాష్ట్ర ప్రభుత్వ భాద్యత కూడా వుంది. ఫిలిమ్ స్కూల్స్ పెట్టడం,ఇప్పుడున్న యూనివర్సిటీల్లో మాస్ మీడియా కోర్సులు పెట్టడం చేయాలి. గొప్ప సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తూ ప్రధాన జిల్లా కేంద్రాల్లో చిన్న చిన్న థియేటర్లు నిర్మించాల్సి వుంది. ఇలా ప్రభుత్వం కొంత తోడ్పడితే తెలంగాణా నుంచి  మంచి షార్ట్ ఫిలింలు భవిష్యత్తు లో పూర్తి నిడివి చిత్రాలు వచ్చి తెలంగాణ జెండాని ప్రపంచ వ్యాప్తంగా రేప రేప లాడించే అవకాశం వుంటుంది.

25, డిసెంబర్ 2015, శుక్రవారం

కవిత్వం

కవిత్వం

 మోమ్ బత్తి వెలిగించా
గదిలో ఆవరించి వున్న చీకటి
తలవంచుకు నిశ్శబ్దంగా
బయటకు వెళ్లిపోయింది

కిటికీల్లోంచి వెంటిలేటర్ల లోంచి
అప్పుడప్పుడూ తొంగి చూడడం మొదలుపెట్టింది

కొంచెసేపటికి మొంబత్తి
కరిగి పోయి ఆరిపోయింది
  
చీకటి
సడీ సప్పుడు లేకుండా
గదిలోకి చేరుకుంది
  
కవిని గదా
చీకటిని ఆహ్వానించాను
వచ్చేయి బయటి నీ సమస్తాన్ని వదిలేసి

ఇక్కడ పోగొట్టుకునేది ఏది లేదు

పోగొట్టుకున్నది
వెతుక్కోవడానికి కాదు
కవిత్వం

పొగుట్టుకున్నది కూడా
మన వెంట వుండడమే
కవిత్వం
-వారాల ఆనంద్

9440501281
స్వయం కృషి
 సూర్యుడి కంటే ముందే
ఎవరో పిలిచినట్టనిపిచ్చింది
బాల్కనీ లోకి వెళ్ళాను

అప్పటి దాకా
ముచ్చట్లా డుతూ మురిపెంగా వున్న
పక్షుల జంట
రివ్వున ఎగిరి అటూ ఇటూ తిరిగి
ఎగిరి పోయింది
మనసేక్కడో తడి తడిగా ...

రెండూ గురిగి బుడ్లు తెచ్చి
బాల్కనీలో వేలాడకట్టాను
గూడు కోసం

తెల్లవారి ఎవరూ పిలవకుండానే 
సూర్యుడికంటే ముందే లేచి
కిటికీలోంచి బయటకు చూశాను
కిల కిల లాడుతూ పక్షులు
వేలాడగట్టిన కుండల  పై
ఊయల వూగు తున్నాయి
 మనసంతా హాయి హాయిగా ...
  
ఆడుతూ ఆడుతూ ఎగిరి పోయి
ఆ పక్కనే వేలాడుతున్న
ఎండిన గుమ్మడి కాయకు
రంధ్రం చేస్తూ తమ గూడు తామే
నిర్మించుకుంటున్నాయి

పక్షుల మీద కోపం లేదు
బాధ అంతకంటే లేదు
అవి నా హృదయానికి
మరింత చేరువయ్యాయి

 -వారాల ఆనంద్ 

పాట- పాటగాడు


పాట- పాటగాడు   

 అవిటి కాళ్ళు
ఆరని ఆర్తి

చెక్క బల్ల
నాలుగు గీరలు
నడకయినా పరుగయినా
చక్రాల బల్ల నే

అరచేతులే
పడవ తెడ్లై
జాన ప్రవాహం లో
అతన్ని నడిపిస్తాయి

చక్రాల్లాంటి కళ్ళు
తెర చాపలయి దిక్కులు చూపిస్తాయి

అరాచకపు ట్రాఫిక్ రణ గొణ నడుమ
అటూ ఇటూ చూసి
రోడ్డు పక్క లంగరేసుకుని
చక్రాల బండి నిలిచి పోతుంది

దుఖం లో తడిసిన
పాటేదో అలలు అలలు గా
అక్కడంతా వ్యాపిస్తుంది

కంఠం లో మాధుర్యం లేదు
రాగం లో సరిగమల్లేవు
గురిచూసి హృదయాన్ని తాకే
గుణమేదో పాటకు
ప్రాణం పోస్తోంది

భాషలు ఒకటో రెండో
రెండూ కలివిడిగానో
పాట ప్రవాహమై పరీవ్యాప్తమవుతోంది

ఆర్ధ్రతో ఆకలో
జీవనపోరాటపు
కంజీర నాదమో
మనసంతా కలి కలి

ఉరుకులు పరుగుల నడుమ
కాలం నిలవదు
పాటా అంతే
గొంతు లోదే కాదు
గుండె లోని తడి ఆరేదాకా

 గడియ రికామీ లేని
రోడ్లన్నీ
పరుగులు పెడుతూనే వున్నాయి
  
పాటకు
అడవిల పొద్దు గూకింది
పాటగాడికి
ఎడారిల తెల్లారింది

-వారాల ఆనంద్

9440501281    aanandvarala@gmail.com

జుగల్ బంది

జుగల్ బంది
తొలి పరిచయం లోనే చిరునవ్వుతో
నా హృది లో విత్తనం నాటావు
నేస్తమా
తిరిగి వచ్చి చూడు అది మొలకెత్తి
స్నేహం ప్రేమల జుగల్ బందీ ని విరబూస్తోంది
=================================================
జీవితం
జీవితం లో ఉల్లాసం ఉదాసీనత
కభీ కుషీ కభీ ఘం , ఏది ఎక్కువ ఏది తక్కువ
నేస్తమా
ఆనందం కొన్ని క్షణాలే పూల రేకుల్లా  
దుఖం కొంత సుధీర్ఘం  అంటించిన ఆగర్ బత్తీలా
================================================
చీకటీ వెళ్తురూ
ఎప్పటిలాగే రాత్రి చీకటి తలవంచుకుని పలక రిస్తున్నది  
తెల్లారి వెళ్తురు ఆకాశం మెట్లెక్కి ఆవరిస్తున్నది
నేస్తమా
చీకటిలో వెళ్తురులో తేడా లేదు కొంచెం ముందూ వెనుకా
తేడా అంతా మనుషుల్లోనూ మనసుల్లోనూ


-వారాల ఆనంద్ 
ఒకటే
-వారాల ఆనంద్

దుఖం చీకటి
రెండూ ఒకటే

దుఖం లో చీకటి కమ్ముకొస్తుంది
చీకటి లో దుఖం రెట్టింపవుతుంది

-----------------------------------------------------------------------------------------------
పర్యాయ పదాలు
-వారాల ఆనంద్
నా కవిత్వంలో
బాధ దుఖం పరుచుకుని వుంటాయంటున్నారు

బాధ కవిత్వం
రెండూ పర్యాయ పదాలు
-------------------------------------------------------------------------------------------------

-తెలుగు వెలుగు

బంధం
-వారాల ఆనంద్

ఎదురు చూపు నిరాశ కావలపిల్లలు
రెంటి నడుమా కాలం
సాగీ సాగీ పుటుక్కున తెగిపోతుంది

ఎదురు చూపులో
అమితమైన ఆశ వున్నది
నిరాశ లో బయట పడని దుఖం వున్నది

రెంటి తో నాకు
విడదీయరాని బంధం వున్నది

= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =




పెన్ను
-వారాల ఆనంద్

కొత్తదే పెన్ను
దర్జాగా ఠీవిగా
కాగితం మీద కదలదే ఎంతసేపటికీ

గీతలూ రాతలూ మర్చిపోయావా
అడిగాను కొంచెం కోపంగానే

నడిస్తే నడిపిస్తే
నడకేమిటి పరుగులు పెడతాను
పెన్ను చల్లగా బదులిచ్చింది

ఉలిక్కి పడ్డాను
నా కవిత్వాన్ని కాకెత్తుకు పోయిందా
నాలో జల ఇంకిపోయిండా
నన్ను నేను పుటం పెట్టుకోవడం
తవ్వి తలపోసుకోవడం
 మొదలు పెట్టాను
==========================================================
నేనూ నా శరీరం
-వారాల ఆనంద్
శరీరం నేను చెప్పినట్టు
వినడం మానేసి చాలా కాలమైంది

నేను లేకుండా శరీరం లేదు 
శరీరం లేకుండా నేను లేను
వెళ్తురు చీకట్లోకి, చీకటి వెళ్తురు లోకి
కాళ్లీడ్చుకుంటూ కరిగిపోయినట్టు
నేను శరీరం లోకి శరీరం నాలోకి

అవిచ్ఛిన్న సహజీవనం

నిజానికి నేనూ శరీరం వేర్వేరా ఒకటేనా

ఏది బొంగరం  ఏది తాడు
ఏది ఇరుసు ఏది కందెన 
======================================================



ఖాళీగా లేను
-వారాల ఆనంద్
మాటల్ని వెతుక్కుంటున్నాను
మనసు నిండా మాట్లాడ్డం బందై  చాలా కాలమైంది

అట్లని మౌనం పందిరి కింద
నేనేమీ ఖాళీగా లేను

సముద్రపు అలల అంచుల్లోని
మీగడ లాంటి నురగని
దోసిట్లోకి తీసుకుని ముద్దాడుతున్నాను

ఆకాశం కాన్వాస్  పై మబ్బులు వేస్తున్న
రంగుల చిత్రాల్ని ఆస్వాదిస్తున్నాను

చెట్ల చిగురు టాకుల్లోని  స్వచ్ఛతనీ
సున్నితత్వాన్ని అవలోకిస్తున్నాను

మౌనం పందిరికింద
నేనేమీ ఖాళీగా లేను

తప్పి పోయిన మనిషిని, మనిషి తనాన్ని
వెతుక్కుంటున్నాన
ఆశగా ఆతృత గా         
============================================================                                                                     
సాకాలి
కాలం నన్ను లాలిస్తుందా మురిపిస్తుందా
కరిగి పోతూ కరిగి పోతూ కదిలిస్తుంది
కలల్ని నాటుకుంటూ నడిచిపోతుంది
నేస్తమా
నేనే నీళ్ళు పోస్తూ సాకాలి
===============================
ఆలంబన
నువ్వు ఎక్కడున్నావ్ కళ్లలోనా కలల్లోనా
ఊహల్లోనా ఊసుల్లోనా
నేస్తమా
నువ్వున్నావనే ధ్యాసే
నా గుండె కదలికకి ఆలాపన
తెరిచివున్న నా కనురెప్పలకి ఆలంబన
================================
రాగాలాపన
జిందగీ సదా సాగే సంగీత ధ్వని
నిన్న నేడు రేపు
గొప్ప లయాత్మక కదలిక
నేస్తమా
కావలసిందల్లా
శ్రుతి తప్పని రాగాలపనే

-వారాల ఆనంద్  18/11/2015