4, నవంబర్ 2013, సోమవారం

మనుషులే... 

ఏదో ఒక క్షణాన 
సంక్షోభం ఆవరిస్తుంది 
తెలియని  సంక్లిష్టత 
చుట్టూ ముడుతుంది 
ధైర్యం కొడి గడుతుంది
దైన్యం ముప్పిరిగొంటుంది

అప్పుడే వీరులైన మనుషులు 
ధైర్యాన్ని ప్రదర్శిస్తారు 
కూలిపోతున్న ఆకాశాన్ని 
ఒంటి చేత్తో నిలువరిస్తారు 
ఎగిసి పడుతున్న సముద్రాన్ని 
వీపు తడిమి ఒదారుస్తారు
కాలి పోతున్న అడవిని 
కన్నీటి ధారలతో ఆర్పుతారు 

అవును మనుషులే 
గందరగోళం నుంచి 
స్పష్టత వైపు దారి తీస్తారు 
మంచు కొండల్ని కరగ దీసి 
సూర్యోదయాల్ని ఆహ్వానిస్తారు 
నీటి మబ్బుల్ని నేల పైకి లాగి 
పంట పొలాల్ని పచ్చగా విస్తరిస్తారు 

అవును రక్త మాంసాలున్న మనుషులే 
అగ్ని పరీక్షకు నిలుస్తారు 
సంక్షోభాల్ని తుత్తునియలు చేస్తారు 

ఆత్మగల మనుషులే 
అన్ని శక్తుల్ని కూడదీసుకుని 
కూలిపోకుండా నిలదొక్కుకుంటారు 
చేతులు బార్లా జాపి 
అందర్నీ నిలబెడతారు 
-వారాల ఆనంద్

1 కామెంట్‌:

  1. అవును రక్త మాంసాలున్న మనుషులే
    అగ్ని పరీక్షకు నిలుస్తారు ...ఆత్మగల మనుషులే
    అన్ని శక్తుల్ని కూడదీసుకుని
    కూలిపోకుండా నిలదొక్కుకుంటారు

    రిప్లయితొలగించండి