1, నవంబర్ 2013, శుక్రవారం

సమయమిదే...

 లోపలెక్కడో దాగి వున్న
పిసరంత ధైర్యాన్ని కూడగట్టుకుని
నిలబడాల్సిన సమయమిదే
ఊహించని తూఫాను గాలికి
విలవిల్లాడిన ఆకుల్ని ఆలోచనల్ని
చేతుల్ని చేతల్ని అదిమి పట్టుకుని
కూలి పోకుండా నిలబడాల్సిన సమయమిదే
వాస్తవాన్ని  వాస్తవంగా   అర్థం చేసుకుని
 నిలబడాల్సిన సమయమిదే
చెదిరిన మనస్సుని,అదిరిన గుండెని
చేతబుచ్చుకుని సాహసిగా
నిలదొక్కుకొవాల్సిన సందర్భామిదే
బలహీన క్షణాలు ఎదురవుతాయి
చిగురుటాకులా విల విల్లాడే
సందర్భాలు వస్తాయి
ఏమి తోచని ఎటూ పాలుపోని
స్థితిలోకి నెత్తి వేయబడే స్థితి వస్తుంది
తుఫానులో చిక్కుకున్నట్టు
ఊబిలో కూరుకు పోయినట్టు
అన్ని కూలిపోతున్నట్టు
ఏమి తోచని స్థితి ...
సరిగ్గా ఇప్పుడే ఇక్కడే
నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి
ఓటమి అంచుని తాకి, విజయ తీరాలవైపు సాగాలి
సర్వ శక్తుల్ని కూడదీసుకున్న వీరత్వాన్ని
సమస్త వాస్తవాల్ని అర్థం  చేసుకున్న మానవత్వాన్ని
అందిపుచ్చుకుని నిలబడాలి
నిర్భయంగా,నిజాయితిగా, నిటారుగా
ముందుకు నడవాల్సిన సమయం ఇదే
-ఆనంద్ వారాల
9440501281

1 కామెంట్‌: