దుఖం కేంద్రీకృతమయింది
------------------------------------------
ఆకాశం లో కమ్ము కున్న నల్ల మబ్బుల్లాగా
గాలి దుమారం లో రోడ్డు మిద గాలి
సుడి దిరిగీ దిరిగీ
ముంచు కొచ్చినట్టు దుఖం నా మిద దాడి చేసింది
సముద్రం లో అలలన్నీ సుళ్ళు తిరిగి తిరిగీ
తుఫాను గా ముంచెత్తి నట్టు
చెట్ల ఆకులన్నీ రాలి కుప్ప బడ్డట్టు
నన్ను దుఖం మొత్తంగా ఆవరించేసింది
కదలడానికి చేతులూ
నడవడానికి కాళ్ళూ
ఏడి చేందుకు కళ్ళూ.. అన్నీ
ఇసుక పొరల కింద కమ్మేసినట్టు
ఇనుప చెరల కింద బంది అయినట్టు
మనసంత ఆవరించిన దుఖం
ఆలోచనల్నీ నియంత్రిస్తోంది
నడుస్తున్న రథం నిలిచిపోయింది
తోవ మిద దిక్కులు అదృశ్యం అయిపోయాయి
ఆశలన్ని కుప్ప కూలిపోయాయి
కాని
కాలానికి మరుపు మలాం తెలుసు
నాకేమో మళ్లీ మళ్లీ మొలకెత్తే
వాటం తెలుసు
ఆకాశంలో మబ్బుల్ని ముక్కలుగా నరికేసి
సముద్రం లో అలల్ని సరి చేసి
సుడిగాలి లో చెదరని మహా వృక్షం లా
నిలబడ్డా
నదులై వాలి పోయిన కళ్ళు
సూర్య చంద్రులయినాయి
మనసు పొరల అడుగున ఆవరించిన
దుఖం కేంద్రీకృతమయింది
బతుకు మళ్లీ
కొత్త దోవలోకి మళ్ళింది
-వారాల ఆనంద్