6, ఏప్రిల్ 2016, బుధవారం

కవితలు

కావడి కుండలు
===========================
కాలం భుజాలపై
బతుకు కావడి పయనం
ఊగుతూ తూగుతూ

కావడి కుండల్లో
ఒకటి ముందు మరోటి వెనక
ఒకటి సంతోషాన్ని
మరోటి దుఖాన్ని మోస్తూ
తూగుటుయాల్లాగా కావడిని కదిలిస్తున్నాయి

కాలం భుజం మార్చుకున్నప్పుడల్లా
కుండలు ముందు వెనకలవుతున్నాయి
కావడి కంగారు పడుతున్నది


కనికరం తెలీని కాలం
కదిలి పోతూ కదిలిపోతూ
ఏదో ఒక చోట
కావడిని దించేసి
తన దారిన తాను వెళ్లిపోతుంది
మట్టిలో కలిసిన
కావడి కుండలు
మళ్ళీ చిగురిస్తాయి
ఏనాటికయినా
==============

కల్ ఆజ్ ఔర్ కల్
ఈరోజు
నిన్నటి ప్రతి బింబం కాదు
రేపటి రోజుకు
ఇవ్వాల్టి రూపం వుండక పోవచ్చు

నిన్నటి కంటే
రేపు సుధీర్ఘ మయిందీ కావచ్చు

గతం గురించీ
పోగొట్టుకున్న దాని గురించే
మాట్లాడుతూ పోతే

నిన్నటికి రేపటికీ మధ్య
సన్నటి తెర కరిగి పోతుంది 

గతం లోంచి భవిష్యత్తుకు
వేసే నిచ్చెన కూలిపోతుంది

నవ్వులు చిందిస్తూ
కాలం నడిచి వెళ్లిపోతుంది

మిత్రమా
నువ్వూ నేనూ
కాలాన్ని వెనక్కి తిప్పలేక పోవచ్చు

సముద్రాన్ని ఎండ గట్టనూ లేక పోవచ్చు
తూఫాన్ని పిడికిట్లో బిగించ లేక పోవచ్చు

నేటి జీవితాన్ని
రేపటికి పునః ప్రారంభించవచ్చు
పూవులు పూయించ వచ్చు

==================
మనిషి కోసం... ఓ కన్నీటి చుక్క.
మనిషి మనిషి కేమివ్వ గలడు
సాటి మనిషి కేం చేయగలడు

చేద బావిలో బొక్కెనేసి
నీళ్ళు తొడినట్టు
అంతరాంతరాల్లోని దుఖాన్ని
తోడి బయట పోయగలడా

హృదయపు పొరల్లో మెటేసిన
ఒంటరి తనానికి మలాం పూసి
మాయం చేయగలడా

ఎడారిలో ఒయాసిస్సు కోసం
డి సముద్రం లో గుక్కెడు
మంచి నీళ్ళ కోసం వెతికినట్టు
తననుతాను
వెతుక్కుం టున్న మనిషి
సాటి మనిషి కేంచేయగలడు

కాల గమనంలో సాగిపోతున్న
సూర్యోదయాలూ చంద్రోదయాలకంటే
వేగంగా పరుగు చట్రంలోకి  
విసిరేయ బడ్డ మనిషి

మనస్సుని పోగొట్టుకుని
తన నుంచి తానెప్పుడో వేరయిన మనిషి
సాటి మనిషికేం ఊతమివ్వ గలడు

తన భుజాన్ని బండికానిలా
తాకట్టు పెట్టుకున్నవాడు
తోటి మనిషి
బరువునేం మోయగలడు

మనిషి తనాన్నే పోగొట్టుకుని
చుట్టూ వలయాన్ని
దిద్దుకున్న మనిషి
పక్కోడినేం పట్టించు కోగలడు

తనకు పోట్రాయి తగిలితేనో
మోకాలి చిప్ప పగిలి తేనో
పాదాల కింద మంట రగిలితేనో
వులిక్కి పడి కళ్ళు తెరిచే వాడికి  
చుట్టు  పక్కల వాళ్లేమి తెలుస్తారు

వాళ్ళే మనిషి కోసం
ఓ కన్నీటి చుక్క రాల్చాలి తప్ప
=====================
వేర్లు 

కొత్త చట్టాల నాగళ్ళ  తో
నా గుండెల్ని దున్నేస్తున్నారు
పగిలిన నా గుండె సాల్ల ల్ల
ఏ విత్తనం మొలకెత్తుతుంది

చెమటతో తడిసి ముద్దయి  సారవంత మయి
మా జీవితాల్లో పచ్చ దానాన్ని నింపిన నా తల్లిని
అమ్మేయ మంటున్నారు

మా కన్నీళ్లు తుడిచి కడుపు నింపి
తాతనూ అయ్యనూ
నన్నూ తర తరాలుగా
తలెత్తు కునేలా చేసిన భూమిని
సేకరిస్తా మంటున్నారు

నా కాల్రెక్కలు కత్తిరిస్తామంటున్నారు

కంపనీల  కోసమో కచ్చీ ర్ల కోసమో
నన్ను వదిలి పొమ్మంటున్నారు

భూమెందుకు దండగ బాట మార్చ మంటున్నారు
వేళ్ళతో సహా నడిచి పొమ్మంటున్నారు

మట్టిని బంగారం చేయగలిగిన
వాని మూలాల్ని తెంపి
మెడలు పట్టి గెంటేస్తున్నారు
. . . . . . . . . .. . .. . . .

వేళ్ళ కు చుక్కలు పెట్టి ముద్దర్లేయించుకుని
నోటి ముందటి ముద్దనే
లాగేసు కుంటున్నారు

వాడయితేమిటి వీడయితేమిటి
ఒక్క గొంగ ట్లోని వెంట్రుకలే కదా

==========================

ఆత్మ లోతుల్లో మొలకెత్తాలి


బాధ సాంధ్రత తెలిసినంతగా
భాష తెలీదు

గాయం సలపడం తెలినంతగా
మానడం తెలీదు

పెదాల మీద చిరునవ్వు కంటే
చెంపల పై నీటి చారికలే అధికం

తెలిసిందాని కంటే
తెలియందే ఎక్కువ

వ్యక్త పరిచిందానికంటే
అవ్యక్తమే అధికం



పెదాలు ఖాళీగానే వున్నాయి
గొంతుక సవరించ బడే వుంది

మాట మన రక్త సంబంధీకురాలే

అంతర్ బహిర్ భయాలన్నింటినీ
చిలక్కొయ్యకు తగలేసి
స్వేఛ్ఛగా మాట్లాడాలి
స్వచ్చంగా  జీవించాలి

చివరి అంచుకు చేరక ముందే
ఆఖరి క్షణం
ఎదురు కాక ముందే
సత్యం అంతరించక ముందే

ఆత్మ లోతుల్లో మొలకెత్తాలి

ఎప్పటికప్పుడు
పునరుజ్జీవులం కావాలి
======================
జీవితం
పరుపు బండ మీద
పరుగులుపెట్టే బండి చక్రం కాదు

అట్లని
కంకర రాళ్ళ గతుకుల రోడ్డు మీద
నడిచే నగ్న పాదాల నడకా కాదు

అడుగు అడుగిక్కీ మధ్య వ్యత్యాసాలు
కొన్ని హ్రస్వాలూ కొన్ని దీర్ఘాలూ

ఒక్కోసారి ముందుకూ
మరోసారి వెనక్కూ
నిప్పు మీదో
మంచు దిమ్మ మీదో
కఠిక చీకట్లోనో
పండు వెన్నెల్లోనో

అడుగులో అడుగు
అడుగు వెనకాల అడుగు

కదలిక బతుక్కి ప్రాణ వాయువు
చలన శీలతే జీవితం
=================



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి