24, ఏప్రిల్ 2014, గురువారం

ఒంటరితనమూ- ఏకాంతమూ
==================
చీకటి ముసురుకున్న ఆకాశంలో 
వెన్నెల అప్పుడప్పుడే విచ్చు కుంటోంది 
నీడలు దట్టంగాను నల్లగానూ 
పొడుగ్గానూ పడుతున్నాయి 

ఒంటరితనమూ ఏకాంత మూ
ముప్పిరి గొంటున్నాయి

అన్ని భాధలు పెనవేసుకున్న ఒంటరితనం 
అన్ని భయాలూ ఆవరించిన ఒంటరితనం 
అన్నింటిని వదిలేసిన దుఖం ఒంటరితనం 
అందరి నుంచి దూరమయి 
స్వార్థం ఏకాకితనం జంట చక్షువులుగా 
మారిన ఒంటరి తనం 
అవును 
ఒంటరితనం ఓ సంఘర్షణ 
ఒంటరితనం ఓ అనివార్యత 

కాని  ఏకాంతం
ఏ కల్మషం లేని రహదారి 
ఏ గందరగోళం అంటని నివురు
అందరిని వదిలేసి అన్నింటిని తెలుసుకునే 
మౌన సంభాషణ
ఏకాంతం  ఒక తపస్సు 
అనిర్వచనియమైన అవిభాజ్య మైన 
మానసిక స్థితి    
ఏకాంతంలో మనసు విచ్చుకుంటుంది 
ఆర్ద్రతను పెంచుకుంటుంది 
అది దుఖమూ సంతోషమూ 
సంలీన మైన స్థితి 

ఒంటరితనం లోంచి పరిణామం చెందిన
ఏకాంతం 
అంతం లేనిది అనంతమయింది 
-వారాల ఆనంద్ 
22-4-2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి