24, ఏప్రిల్ 2014, గురువారం

ఒంటరితనమూ- ఏకాంతమూ
==================
చీకటి ముసురుకున్న ఆకాశంలో 
వెన్నెల అప్పుడప్పుడే విచ్చు కుంటోంది 
నీడలు దట్టంగాను నల్లగానూ 
పొడుగ్గానూ పడుతున్నాయి 

ఒంటరితనమూ ఏకాంత మూ
ముప్పిరి గొంటున్నాయి

అన్ని భాధలు పెనవేసుకున్న ఒంటరితనం 
అన్ని భయాలూ ఆవరించిన ఒంటరితనం 
అన్నింటిని వదిలేసిన దుఖం ఒంటరితనం 
అందరి నుంచి దూరమయి 
స్వార్థం ఏకాకితనం జంట చక్షువులుగా 
మారిన ఒంటరి తనం 
అవును 
ఒంటరితనం ఓ సంఘర్షణ 
ఒంటరితనం ఓ అనివార్యత 

కాని  ఏకాంతం
ఏ కల్మషం లేని రహదారి 
ఏ గందరగోళం అంటని నివురు
అందరిని వదిలేసి అన్నింటిని తెలుసుకునే 
మౌన సంభాషణ
ఏకాంతం  ఒక తపస్సు 
అనిర్వచనియమైన అవిభాజ్య మైన 
మానసిక స్థితి    
ఏకాంతంలో మనసు విచ్చుకుంటుంది 
ఆర్ద్రతను పెంచుకుంటుంది 
అది దుఖమూ సంతోషమూ 
సంలీన మైన స్థితి 

ఒంటరితనం లోంచి పరిణామం చెందిన
ఏకాంతం 
అంతం లేనిది అనంతమయింది 
-వారాల ఆనంద్ 
22-4-2014

19, ఏప్రిల్ 2014, శనివారం

వెల్తురు ముక్కలు
======================
పువ్వు విప్పారినట్టు 
మంచు కురుస్తున్నట్టు
మేఘం కమ్ముకున్నట్టు 
గది నిండా చీకటి 
కన్ను తెరిచినా మూసినా చీకటే


ఈ చీకటి
కొంచెం తెరిపిస్తే బాగుండు
ఓ క్షణం వెల్తురు కిరణం ఎక్కడుందో చూసి వొచ్చెవాన్ని

ఈ చీకటి 
తేట తెల్లం కాకపోయినా
ఓ క్షణం విశ్రాంతి నిచ్చినా చాలు
ఆరు బయట పువ్వు  వికసించిందో లేదో
మంచు ముత్యాలు మెరిశాయో లేదో
నది కళ్ళు తెరిచి
నేల వైపు చూసిందో లేదో చూసి వొచ్చెవాన్ని
మూసిన కిటికీ లోంచి 
ఓ రెండు  వెల్తురు ముక్కలు కింద పడ్డాయి
కళ్ళకు కొంచెం ప్రాణం వచ్చింది
ఆ వెల్తురు ముక్కల్ని 
చేతిలోకి తీసుకున్నా
ఒళ్లంతా వెల్తురు ప్రవహించిం ది
గది సంగతేమో కాని
నా లోపలి చీకటి అంతా పటాపంచలయింది
-వారాల ఆనంద్ 

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

                                           ఆంధ్ర భూమి సాహితీ లో పబ్లిష్ అయింది
                                       ఆంధ్రభూమి సాహితీ పేజి లో పబ్లిష్ అయింది