20, అక్టోబర్ 2014, సోమవారం


నింగికి ఎగిరిన తార 

( జీవగడ్డ విజయ కుమార్ స్మృతి లో )

కలాలకు గళాలకూ బేడీలు ముసురుకుంటున్న కాలంలో
ఆయన అక్షరాలు కూర్చుకుంటూ
నిర్మలంగా నిలుచున్నాడు

కరీంనగర్ క్లాక్ టవర్ సాక్షిగా
వచ్చేవాళ్ళకూ  పోయేవాళ్ళకూ
మిత్రులకూ  యోధులకూ
యువకులకూ  మేధావులకూ
దిక్సూచిగా నిర్భయంగా నిలుచున్నాడు

అందరినీ అన్నా అని పిలుస్తూ
అందరికీ అన్నా అని పిలిచే సంస్కారాన్ని నేర్పాడు
ఒకరా ఇద్దరా
పెద్ద చిన్న లక్స్మన్ రావు లూ
కొటేశూ సాహూ
తొలి నాగటిసాల్లన్నిటికి
ఆయనొక మజిలీ
రానూ పోనూ ఆయనో  మజిలీ
కొంచెం సేపు సేద దీరేందుకు
ఆయనో చెట్టు నీడ

బదలాతో భాగస్వామ్యం
విద్యుల్లత తో సాహిత్య దర్పణం
ప్రజాస్వామ్య వేదిక జీవగడ్డ
ఆయన ఆవిష్కరించిన అక్షర కుటీరం
ఎలగందుల, కమాన్, క్లాక్ టవర్ లతో పాటు
దశాబ్ద కాలం జీవగడ్డ ఓ దర్శనీయ స్థలం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో
నాడు ప్రవహించిన
ప్రగతి శీల భావాలన్నీ జీవగడ్డ లో
కలిసి మురిసేవి
ఫలవంతమయిన పగళ్ళు
సుధీర్ఘమయిన సాయంత్రాలూ
పిల్లలకోడిలా కరీంనగర్ వీధుల్ని
ఆయన పరిమళింప జేశారు

అల్లం నారాయణ ఎన్నెల కోనల్లో పలవరించినా
కె.ఎన్.చారి న్యాయాలు వివరించినా
ఎన్.శ్రీనివాస్ పన్నుపోటు తో ఆవేశపడ్డా
ఆనందుడు వారానందం ఆవిష్కరించినా
గోపు జానపదం గురించో నరేందరు క్రికెట్ గురించో చర్చ పెట్టినా
తుమ్మెటి,కాలువ, జాప లక్ష్మా రెడ్డి, కమాల్ కరీంనగరి
ఘంటా చక్రపాణి,నారదాసు,పెండ్యాల, మనోహర్ రావు
ఎందరో ఎందరెందరో ఆయనో విశ్వ వేదిక

ఎందరికో బతుకునిచ్చినవాడు దారి చూపినవాడు
సదా చిరు నవ్వు తో ముందుకే సాగినవాడు
తాను బతుక నేర్వలేక నెరివడ్డాడు  
వందలాది మందిని అక్షర యోధులుగా తీర్చిదిద్దిన వాడు
అక్షరం సాక్షిగా అక్షరం గానే మిగిలిపోయాడు
మొన్న చారి నిన్న నరేందరు
నేడు విజ్జన్న
నెల రాలిన కిరణాలు
నిగికెగిరిన తారలు
( ఆత్మీయ మిత్రుడు జీవగడ్డ విజయకుమార్ స్మృతిలో ..కన్నీటితో..)

-వారాల ఆనంద్ -9440501281