29, నవంబర్ 2013, శుక్రవారం

ప్రకృతి-మనుషులు
============================
వర్షం ముగిసిన సమయాన 
సాయంకాలపు వేళ
కురుస్తున్న సూర్యకిరణాల వెలుగులు,

ప్రకృతి
పసిడి వర్ణం అద్దుకుని
కను చూపు మీరంతా కాంతులీనుతుంది 

నది 
నవ వసంతాల్ని అనుభూతిస్తుంది 

చేమంతి 
అప్పుడే విచ్చుకుని 
మరింత మురిపెంగా రంగులీనుతుంది 

పక్షి 
ఆహ్లాదంగా రెక్కలు రెప రెప లాడిస్తుంది 

నిజంగానే ప్రకృతి లో 
నవ యవ్వనం ప్రతి ఫలిస్తుంది


వేల ఏళ్ళుగా ఇంతే 
ప్రకృతి కేమో వయసు తెలీదు 
ఈ మనుషులకే 
యవ్వనమూ ముసలితనమూ 
-వారాల ఆనంద్

26, నవంబర్ 2013, మంగళవారం

మౌనం
================
నా మౌనం ఒక మౌనం కాదు
నా మౌనం వెనకాల దృశ్యాల పరంపర
నా మౌనం ఒక 'ఆంధీ'
అంధీ   గలీలు దాటుకుంటూ
జిందగీని  తవ్వుకుంటూ
చౌరంఘి లేన్ లో స్థిరపడింది

అనుకుంటాం కాని
నా మౌనం స్థిరపడలేదు
క్షణం క్షణం గుండె లబ్ డబ్ ల తోడు గా
శబ్దా శబ్దా ల నడుమ
లోపలి బయటకి పింగ్  పాంగ్  ఆడుతోంది

దారి పొడుగునా ధ్వనిస్తున్న
నినాదాల హోరు కావల
నిదానమయి నా మౌనం కన్నీరు కారుస్తోంది
ఆరిపోతున్న యవ్వన దీపాల
కొడిగట్టే వెల్తురు కిరణపు వెలుగులో
నా మౌనం మినుకు మినుకు మంటోంది
అనుకుంటాం గాని
నా మౌనం ఇవ్వాల్టిది కాదు
ఇప్పటి దీ  కాదు   

ఆశపడతాం కాని

మౌనం వీడి
నాలుగు మాటలొస్తే బాగుండునని
అర్థం లేని మాటల కంటే
ఎన్నో భావాల్ని ప్రసారం చేసే
మౌనమే గొప్పది కదా
మౌనమే గొప్ప సంభాషణ కదా
-వారాల ఆనంద్

9440501281

22, నవంబర్ 2013, శుక్రవారం

శేషం
=======
లోతూ దరీ తెలీని నది
దుఖం

అడ్డూ ఆపూ లేని ప్రవాహం

ఆనందం


అంతులేనిది దుఖం

అంతం లేనిది  ఆనందం


ఏది దుఖం

ఏది ఆనందం

ఏది నిజం

ఏది అబద్దం

 

దుఖాన్ని ఆనందం చే
భాగించేసా

శేషం గా మిగిలింది

నేనూ నా కవిత్వం

-వారాల ఆనంద్
aanandvarala.blogspot.in

18, నవంబర్ 2013, సోమవారం

నేను
=====
 నా చేతులతో
దుఖాన్ని కౌగిలించు కున్నా
అది నా గుండెల్లో ఇంకి పోయింది

నా కళ్ళ తో
వర్షాన్ని కోరుకున్నా
అది భూమి తల్లి గుండెల్లో ఇంకి పోయింది
అయితేనేం
మట్టి పోత్తిల్లలోంచి
ఓ విత్తనం మొలకెత్తినట్టు
నా హృదయం లోంచి
ఓ చిరు ఆనందం చిగిరించింది
-------

నేనెప్పుడూ నేనులా
ఉండాలనే కోరుకుంటాను
నాకు నటించడం చేతగాదు
కష్టాలూ కన్నీల్లూ నాకు తెలుసు
ప్రేమించడం స్నేహించడమూ  తెలుసు
అందుకే
నేను మరెవ్వరిలానూ ఉండలేను
-వారాల ఆనంద్
aanandvarala.blogspot.in


16, నవంబర్ 2013, శనివారం

దుఖం కేంద్రీకృతమయింది 
------------------------------------------
ఆకాశం లో కమ్ము కున్న నల్ల మబ్బుల్లాగా 
గాలి దుమారం లో రోడ్డు మిద గాలి 
సుడి దిరిగీ దిరిగీ
ముంచు కొచ్చినట్టు దుఖం నా మిద దాడి చేసింది 
సముద్రం లో అలలన్నీ సుళ్ళు తిరిగి తిరిగీ
తుఫాను గా ముంచెత్తి నట్టు 
చెట్ల ఆకులన్నీ రాలి కుప్ప బడ్డట్టు
నన్ను దుఖం మొత్తంగా ఆవరించేసింది 
కదలడానికి చేతులూ
నడవడానికి కాళ్ళూ 
 ఏడి చేందుకు  కళ్ళూ.. అన్నీ 
ఇసుక పొరల కింద కమ్మేసినట్టు  
ఇనుప చెరల కింద బంది అయినట్టు 
మనసంత ఆవరించిన దుఖం 
ఆలోచనల్నీ నియంత్రిస్తోంది 

నడుస్తున్న రథం నిలిచిపోయింది 
తోవ మిద దిక్కులు అదృశ్యం అయిపోయాయి 
ఆశలన్ని కుప్ప కూలిపోయాయి 

కాని 
కాలానికి మరుపు మలాం తెలుసు 
నాకేమో మళ్లీ మళ్లీ మొలకెత్తే 
వాటం తెలుసు 
ఆకాశంలో మబ్బుల్ని ముక్కలుగా నరికేసి 
సముద్రం లో అలల్ని సరి చేసి 
సుడిగాలి లో చెదరని మహా వృక్షం లా 
నిలబడ్డా 
నదులై వాలి పోయిన కళ్ళు 
సూర్య చంద్రులయినాయి 
మనసు పొరల అడుగున ఆవరించిన 
దుఖం కేంద్రీకృతమయింది
బతుకు మళ్లీ 
కొత్త దోవలోకి మళ్ళింది 

-వారాల ఆనంద్ 

15, నవంబర్ 2013, శుక్రవారం


భావ లయ 
--------------------------------------------------------------------
సూర్య  చంద్రుల సాక్షిగా
కాలం గడుస్తూనే వుంటుంది
జీవితం లో
అనుభవం మాత్రం మిగిలుతుంది
================================

చీకటి శూన్యము
అమితంగా భయపెడతాయి
కాని వాటిలోంచే
వేల్తురూ సృష్టి మొదలవుతాయి
==============================

పరిచయాలూ పలకరింపులూ
రోజంతా గడిచి పోతుంది!!
స్నేహం తోటే కదా
బతుకు నిండేది
==================================

ఎన్నో ఆలోచనలు
తేనే తీగల్లా ముసురుకొంటాయి
అక్షరాల్ని కుప్ప బోసినట్టు
అర్థ ముండదూ ఆర్ద్రత ఉండదూ
================================

ఎన్నో మాట్లాడాలనుకుంటాం
నీ గురించీ నా గురించీ
ఎంత మాట్లాడినా మిగిలేదేముంది
అది మనం గురించో జనం గురించో అయితే తప్ప

===============================

14, నవంబర్ 2013, గురువారం

మొదలయింది...
 కాళ్ళూ చేతులూ ముడుచుకుని
కూర్చోలేం కదా
ఏదో ఒకటి మొదలు పెట్టాలి
ఆలోచనలోంచో అనుభవం లోంచో

అసలు మొదలు పెట్టడమే సమస్య

అప్పటి దాకా గోడ కుర్చీ వేసినట్టు
చిలక్కొయ్యకు వేలాడ దిసినట్టు
గుండెల్లో నులు వెచ్చటి  అలసట

మొదలు పెట్టింది ముందు కో  వెనక్కో

బావి లో బొక్కెన వేసినట్టు
అడవి లో కేకేసినట్టు

అందుకే

దేనికైనా శ్రీకారం చుట్టడం
వాకిట్లో ముగ్గేసినట్టు కాదు
నిశబ్ద నిశీధి లో
వెలుతురు కిరణాల్ని ఆవిష్కరించినట్టు
ప్రశాంత సరస్సు లో
అలల్ని సృష్టించినట్టు
అందుకే
ఏదైనా మొదలు పెట్టడమే కష్టం
మనసుని కూడా దీసు కోవాలి 
ఆలోచనల్ని సరి చేసుకోవాలి
అందమైన పువ్వుల్ని పేర్చాలి
శుభ్రయిన నవ్వుల్ని కూర్చాలి
కలల్ని అల్లాలి కన్నిళ్ళని చల్లాలి

మొదలైంది ఏది ముగియకుండా వుండదు

అది బతుకయినా....  కవితయినా...!!!
-వారాల ఆనంద్

aanandvarala.blogspot.in