12, మార్చి 2016, శనివారం

కాగితం

కాగితం
కాగితాన్ని ముందేసుకు కూర్చుంటాను
గంటల కొద్దీ రాత్రులూ పగళ్లూ
చేతిలో కలం కాసేపు నిశ్చలంగానే వుంటుంది
ఇంకొంచెపు సేపు నోట్లో నలుగుతూనో
తలపైన నృత్యం చేస్తూనో వుంటుంది

యమ యాతన
తెల్ల కాగితంపై నాలుగు అక్షరాలు పొదగడానికి
నాలుగు మాటలు అల్లడానికి

నాలోకి నేను ప్రవేశిస్తాను
నాకు తెలీందేమైనా దొరుకుతుందేమోనని
శరీరంలో ఏముంది అవయాల పొందిక
మనసులోకి వెళ్ళాను
ఆత్మలోకి తొంగి చూశాను
నిజంగానే నాకు తెలీని విషయాలు
నాలోనూ వున్నాయి

నాలోంచి సమాజం మీద పడ్డా
పొరలు పొరలుగా
విడిపోయి వున్న సమాజం 
ఏకశిల కాదు, మొజైక్

లోపలా బయటా
ఈ బైఫోకల్ దృష్టి
నన్ను ఇస్సుర్రాయిలో పడేసి నలిపేసింది

చర్నింగ్ చర్నింగ్
అతలాకుతలం అంతర్మధనం
అప్పటిదాకా నాలో
మూసి వున్న దర్వాజా
ఏదో తెరుచుకున్నట్టయింది

పిడికిట్లోంచి సన్నని ఇసుకేదో రాలి పోయినట్టు
ఏదో జారిపోతున్నది
చూద్దును కదా
కాగితంపై కవిత్వం విచ్చుకుంటోంది.

https://aanandvarala.wordpress.com/ 

జానే కహాన్ గయే వో దిన్


చుక్క పొద్దు తో లేవడం
నడుం వంచడం
నలుగురితో పలకడం పంచుకోవడం

బాగున్న వానే.. అంటూ
ఫేస్ టు ఫేస్ లే తప్ప
ఫేస్ బుక్కుల లుక్కుల్లేవు
వాట్స్ అప్ ల టెక్కుల్లేవు

చీకటయితే చాలు
‘గూట్లే దీపం నోట్లే బుక్క’
గట్కో అంబాలో
కడుపుల ఇంతేసుకుని
కాళ్ళు బార్లా జాపి
చుక్కల్ని లెక్క బెడుతూ
కూని రాగాలు తీసిన కాలమది
దీర్ఘ నిద్రలూ సుధీర్ఘ రాత్రులూ
రంగుల కలల్లేవు, కల్లల్లేవు
నిద్దట్లో కలవరింతల్లేవు అంతా
మన ఆధీనం లోనే వుండేది
స్నేహాలకు ప్రేమలకు అర్థముండేది
మంచికీ చెడ్డకూ
చుట్టూ సమూహముండేది ……

జానే కహాన్ గయే వో దిన్ 

ఎప్పట్లాగే




ప్రతి రోజు లాగానే
మళ్ళీ ఈ రోజు మొదలయింది
గాయాల నదిని మోస్తూ

గతం లో లాగానే
చీకటి ఎంతగా కమ్మేసినా
నిద్ర విడాకులిచ్చేసింది
రాత్రంతా మెలకువ నిండింది

కళ్ళు ఎంత గట్టిగా మూసుకున్నా
మనసుని ఆలోచనల్ని
బిరడా బిగించి బంధించ లేం కదా


నిరాశను నిర్వీర్యం చేసే
నేస్తమా ఎక్కడని వెతకను నువ్వెక్కడున్నావ్
మళ్ళీ దీపం ముట్టిద్దాం రా

ప్రశాంతంగా వెలుగును నింపుదాం రా ! ! ! 

చార్లీ చాప్లిన్

చార్లీ చాప్లిన్ 

హాస్యం వారధిగా 
దుఖాన్ని 
దృశ్య మానం చేశావు 

చిత్రంగా 

హాస్యం సమస్త లోకానికి చేరింది 
దుఖం మాత్రం నీలో నిలిచిపోయింది 


చలనశీలత



జీవితం కేవలం
పరుపు బండ మీద
పరుగులుపెట్టే బండి చక్రం కాదు

అట్లని
కంకర రాళ్ళ గతుకుల రోడ్డు మీద
నడిచే నగ్న పాదాల నడకా కాదు

అడుగు అడుక్కీ మధ్య వ్యత్యాసం
కొన్ని హ్రస్వాలూ మరిన్ని దీర్ఘాలూ

ఒకసారి ముందుకూ మరోసారి వెనక్కూ
నిప్పుల మీదో మంచు దిమ్మె మీదో

కటిక చీకటి లోనో  పండు వెన్నెల్లోనో
అడుగు లో అడుగు అడుగు వెనకాల అడుగు  
కదలిక బతుక్కి ప్రాణవాయువు

చలన శీలతే జీవితం 


కల్ ఆజ్ ఔర్ కల్
ఈరోజు
నిన్నటి ప్రతి బింబం కాదు
రేపటి రోజుకు
ఇవ్వాల్టి రూపం వుండక పోవచ్చు

నిన్నటి కంటే
రేపు సుధీర్ఘ మయిందీ కావచ్చు

గతం గురించీ
పోగొట్టుకున్న దాని గురించే
మాట్లాడుతూ పోతే

నిన్నటికి రేపటికీ మధ్య
సన్నటి తెర కరిగి పోతుంది



గతం లోంచి భవిష్యత్తుకు
వేసే నిచ్చెన కూలిపోతుంది

నవ్వులు చిందిస్తూ
కాలం నడిచి వెళ్లిపోతుంది

మిత్రమా
నువ్వూ నేనూ
కాలాన్ని వెనక్కి తిప్పలేక పోవచ్చు

సముద్రాన్ని ఎండ గట్టనూ లేక పోవచ్చు
తూఫాన్ని పిడికిట్లో బిగించ లేక పోవచ్చు

నేటి జీవితాన్ని
రేపటికి పునః ప్రారంభించవచ్చు
పూవులు పూయించ వచ్చు