14, నవంబర్ 2013, గురువారం

మొదలయింది...
 కాళ్ళూ చేతులూ ముడుచుకుని
కూర్చోలేం కదా
ఏదో ఒకటి మొదలు పెట్టాలి
ఆలోచనలోంచో అనుభవం లోంచో

అసలు మొదలు పెట్టడమే సమస్య

అప్పటి దాకా గోడ కుర్చీ వేసినట్టు
చిలక్కొయ్యకు వేలాడ దిసినట్టు
గుండెల్లో నులు వెచ్చటి  అలసట

మొదలు పెట్టింది ముందు కో  వెనక్కో

బావి లో బొక్కెన వేసినట్టు
అడవి లో కేకేసినట్టు

అందుకే

దేనికైనా శ్రీకారం చుట్టడం
వాకిట్లో ముగ్గేసినట్టు కాదు
నిశబ్ద నిశీధి లో
వెలుతురు కిరణాల్ని ఆవిష్కరించినట్టు
ప్రశాంత సరస్సు లో
అలల్ని సృష్టించినట్టు
అందుకే
ఏదైనా మొదలు పెట్టడమే కష్టం
మనసుని కూడా దీసు కోవాలి 
ఆలోచనల్ని సరి చేసుకోవాలి
అందమైన పువ్వుల్ని పేర్చాలి
శుభ్రయిన నవ్వుల్ని కూర్చాలి
కలల్ని అల్లాలి కన్నిళ్ళని చల్లాలి

మొదలైంది ఏది ముగియకుండా వుండదు

అది బతుకయినా....  కవితయినా...!!!
-వారాల ఆనంద్

aanandvarala.blogspot.in

11, నవంబర్ 2013, సోమవారం

మాట్లాడటమే 

నిర్మూలించలేనిది
నిభాయించుకోవడమే...
తప్పదు మరి
మాట్లాడ లేనప్పుడు
మౌనమే గొప్ప భాష
కాళ్ళు కదల లేని స్థితిలో
మనసే అనేక ప్రయాణాలు చేస్తుంది

విశాలమయిన అడవిలో
చెట్లన్నీ నరికేసినప్పుడు
మొదల్లన్నిమొండాలు మొండాలుగా
విషాదంగా కనిపిస్తాయి
ఆకులన్నీ రాలి పోయినప్పుడు
మహా వృక్షమే
చేష్టలుడిగి దిగాలుగా దిక్కులు చూస్తుంది
ఎండకు ఎండి నెర్రలు వారిన
నేలతల్లి దాహంగా ఆకాశం కేసి చూస్తుంది

ఒక్కోసారి 
అనివార్యతే నిర్భందమౌతుంది
అనామోదితమే ఆవహించబడుతుంది
నిశబ్దమె నిర్భందంగా పైన కూర్చుంటుంది
కాని
అన్ని అనివార్యలకి
అన్ని నిర్భందాలకి
అన్ని మౌనాలకి ఒకే సమాధానం
నిశబ్దాన్ని చేదించుకు మాట్లాడ్డమే
గుండెను గొంతులోకి తెచ్చుకుని
విచ్చుకోవడమే
-వారాల ఆనంద్

7, నవంబర్ 2013, గురువారం

బతుకు
---------------
బతుకు కష్టంగా వుందా
నిరాశ చుట్టూ
ఓ వృత్తాన్ని గీయి
ఆశ దాని చుట్టూ తిరిగి తిరిగి
నిటారుగా
ని ముందు నిలుచుంటుంది
.............................................
ఎక్కడ
---------
దుఖమూ సంతోషమూ
మొదలెక్కడ చివరెక్కడ

చీకటి వెల్తురూ
దారేక్కడ దరెక్కడ

నిద్రా మెలకువా
పోరెక్కడ బతుకక్కడ
.............................................

మిత్రమా
------------------
మనం మాట్లాడుకోవడం మానేసి
చాలా రోజులైంది

పలకరించుకోవడమే మిగిలింది

అవును మరి
మాట్లాడుకోవడానికి
మనసులుండాలి , ఆత్మలు ఉండాలి
ఎదురు ఎదురుగ్గా మనుషులు వుండాలి
........................................................
మలుపు
----------
సాఫీగా గడిచిపోతున్న
జీవితంలో
ఓ పెద్ద కుదుపు

అది మొదటిది కాదు
చివరిది కాదు
మిగిలిన జీవితానికో
పెద్ద మూల మలుపు


4, నవంబర్ 2013, సోమవారం

మనుషులే... 

ఏదో ఒక క్షణాన 
సంక్షోభం ఆవరిస్తుంది 
తెలియని  సంక్లిష్టత 
చుట్టూ ముడుతుంది 
ధైర్యం కొడి గడుతుంది
దైన్యం ముప్పిరిగొంటుంది

అప్పుడే వీరులైన మనుషులు 
ధైర్యాన్ని ప్రదర్శిస్తారు 
కూలిపోతున్న ఆకాశాన్ని 
ఒంటి చేత్తో నిలువరిస్తారు 
ఎగిసి పడుతున్న సముద్రాన్ని 
వీపు తడిమి ఒదారుస్తారు
కాలి పోతున్న అడవిని 
కన్నీటి ధారలతో ఆర్పుతారు 

అవును మనుషులే 
గందరగోళం నుంచి 
స్పష్టత వైపు దారి తీస్తారు 
మంచు కొండల్ని కరగ దీసి 
సూర్యోదయాల్ని ఆహ్వానిస్తారు 
నీటి మబ్బుల్ని నేల పైకి లాగి 
పంట పొలాల్ని పచ్చగా విస్తరిస్తారు 

అవును రక్త మాంసాలున్న మనుషులే 
అగ్ని పరీక్షకు నిలుస్తారు 
సంక్షోభాల్ని తుత్తునియలు చేస్తారు 

ఆత్మగల మనుషులే 
అన్ని శక్తుల్ని కూడదీసుకుని 
కూలిపోకుండా నిలదొక్కుకుంటారు 
చేతులు బార్లా జాపి 
అందర్నీ నిలబెడతారు 
-వారాల ఆనంద్

2, నవంబర్ 2013, శనివారం

ఇంకా మిగిలేవుంది

నేస్తమా
జీవితాన్ని శోధించాలి
కొంచెం వేదనను వదిలేయి
ఇంకొంచెం ఆశ్చర్యాన్ని విడిచెయి

గుప్పిట విప్పి గుండె లోతుల్లోని

స్వప్నాల్ని మేల్కొల్పాలి
కళ్ళు తెరిచి కన్నీటి
సముద్రాలు దాటాలి
నువ్వు నేను
కలిసి వేరుగా జీవిస్తున్నామా
వేరై కలిసి జీవిస్తున్నామా
నీకు నాకు మధ్య
ప్రేమో విరహమో
మరో అతీతమయిన రాగ బంధమో
ఎంతగా తరచి చూసినా
నిజం ఇంకా తెలియల్సేవుంది
అత్యంత లోతయిన జీవితంలో
తవ్విన కొద్ది
జ్ఞాపకాలుగా పరిణామం చెందిన అనుభవాలు
చీకటి వెలుగుల్ని రాసులుగా పోస్తున్నాయి
ఎత్తు పల్లాల్ని దాటుకుంటూ
కుని రాగాలు తీసుకుంటూ
మనం పయనం సాగించాల్సిందే

మనం కలిసి గడపని

క్షణం ఇంకా మిగిలేవుంది
-వారాల ఆనంద్
9440501281

1, నవంబర్ 2013, శుక్రవారం

ప్రేమ

నిరాశ నిండిన జీవితం
ప్రేమ కోసం ఎంత గా ఆశపడుతుంది

                               చూడు చుట్టూ వున్న
                                చెట్లన్నీ జేవురించాయి
                                పక్షులన్నీ దిగాలు పడ్డాయి
                                నదులన్నీ నడక తప్పాయి
                                పొగ మంచు మసక మసకగా కురుస్తోంది
నిరాశ నిండిన రోజున
వెలుగు కిరణాల మెట్ల ఫై
గాలి కెరటాల వోలె ఉప్పొంగితే

చిరు నవ్వులు విరబూస్తూ ప్రేమ చిగురిస్తుంది
చిరు జల్లు వోలె రోజంతా వర్షిస్తుంది

--ఆనంద్ వారాల
9440501281

సమయమిదే...

 లోపలెక్కడో దాగి వున్న
పిసరంత ధైర్యాన్ని కూడగట్టుకుని
నిలబడాల్సిన సమయమిదే
ఊహించని తూఫాను గాలికి
విలవిల్లాడిన ఆకుల్ని ఆలోచనల్ని
చేతుల్ని చేతల్ని అదిమి పట్టుకుని
కూలి పోకుండా నిలబడాల్సిన సమయమిదే
వాస్తవాన్ని  వాస్తవంగా   అర్థం చేసుకుని
 నిలబడాల్సిన సమయమిదే
చెదిరిన మనస్సుని,అదిరిన గుండెని
చేతబుచ్చుకుని సాహసిగా
నిలదొక్కుకొవాల్సిన సందర్భామిదే
బలహీన క్షణాలు ఎదురవుతాయి
చిగురుటాకులా విల విల్లాడే
సందర్భాలు వస్తాయి
ఏమి తోచని ఎటూ పాలుపోని
స్థితిలోకి నెత్తి వేయబడే స్థితి వస్తుంది
తుఫానులో చిక్కుకున్నట్టు
ఊబిలో కూరుకు పోయినట్టు
అన్ని కూలిపోతున్నట్టు
ఏమి తోచని స్థితి ...
సరిగ్గా ఇప్పుడే ఇక్కడే
నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి
ఓటమి అంచుని తాకి, విజయ తీరాలవైపు సాగాలి
సర్వ శక్తుల్ని కూడదీసుకున్న వీరత్వాన్ని
సమస్త వాస్తవాల్ని అర్థం  చేసుకున్న మానవత్వాన్ని
అందిపుచ్చుకుని నిలబడాలి
నిర్భయంగా,నిజాయితిగా, నిటారుగా
ముందుకు నడవాల్సిన సమయం ఇదే
-ఆనంద్ వారాల
9440501281